హైదరాబాద్, వెలుగు: కోర్టు ఆదేశాల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, శంషాబాద్ తహసీల్దార్ అమరలింగం సోమవారం హైకోర్టు ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గ్రామ పరిధిలోని సర్వే నంబరు 626/2ఏఏలో ఉన్న ప్రైవేటు భూమి స్వాధీనానికి సంబంధించి దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై జస్టిస్ సి.వి.భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు. భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ యజమాని సమర్పించిన వినతిపై నిర్ణయం తీసుకోకముందే అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారన్నది పిటిషనర్ అభ్యంతరం.
ఈ వ్యవహారంలో గతంలోనే వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించినప్పటికీ అధికారులు హాజరుకాకపోవడంతో ఈ నెల 11న డీజీపీ, సంబంధిత కమిషనర్లకు మరోసారి ఆదేశాలు జారీ చేసింది. దీంతో కమిషనర్, తహసీల్దార్ సోమవారం న్యాయస్థానం ముందు హాజరయ్యారు. విచారణ సందర్భంగా హైడ్రా, ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై కౌంటర్లు దాఖలు చేసినట్లు తెలిపారు. వాటిపై రిప్లై కౌంటర్లు దాఖలు చేసేందుకు గడువు కావాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్.శ్రీధర్‌రెడ్డి కోరారు. ఇందుకు న్యాయమూర్తి సమ్మతిస్తూ తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేశారు. తదుపరి విచారణకు కమిషనర్, తహసీల్దార్ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని మినహాయింపు ఇచ్చారు.
