న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మరో షాక్ తగిలింది. ఇప్పటికే హైఎండ్ ఫోన్ల ధరలు పెరగడంతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులపై ఇప్పుడు శామ్సంగ్, షావోమీ భారం మోపాయి. తమ బడ్జెట్, మిడ్‌రేంజ్ స్మార్ట్ఫోన్ల ధరలను పెంచాయి. మొత్తం 41 స్మార్ట్‌ఫోన్ వేరియంట్లపై రూ.1,000 నుంచి రూ.4,000 వరకు ధరలు పెంచినట్లు రిటైల్ వర్గాలు తెలిపాయి. ఈ కొత్త ధరలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి.
శామ్సంగ్ తన గెలాక్సీ ఏ, ఎఫ్ సిరీస్‌లలోని 22 వేరియంట్ల ధరలను సవరించింది. మోడల్, స్టోరేజ్ సామర్థ్యాన్ని బట్టి 3.13 శాతం నుంచి 9.52 శాతం వరకు ధరలు పెరిగాయి. గెలాక్సీ ఏ07 5జీ 4జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21 వేల నుంచి రూ.23 వేలకు చేరింది. 6జీబీ వేరియంట్ ధర కూడా రూ.2,000 పెరిగి రూ.26 వేలకు చేరింది. గెలాక్సీ ఎఫ్17 5జీ అన్ని వేరియంట్లపై రూ.2,000 పెంపు కనిపిస్తోంది.
దీంతో 4జీబీ, 6జీబీ, 8జీబీ మోడళ్ల ధరలు వరుసగా రూ.26 వేలు, రూ.29 వేలు, రూ.32 వేలకు చేరాయి. గెలాక్సీ ఏ17 5జీ ధరలు కూడా పెరిగాయి. చార్జర్‌తో వచ్చే 6జీబీ వేరియంట్ ధర రూ.32వేలకు చేరగా, ఇది లేకుండా వచ్చే మోడల్ ధర రూ.30 వేలకు ఎగిసింది. గెలాక్సీ ఏ57 ధర అత్యధికంగా రూ.4,000 పెరిగింది. 8జీబీ+256జీబీ మోడల్ ధర రూ.67వేలకు, 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.76,499కు చేరింది. గెలాక్సీ ఏ36, ఏ56, ఏ37 మోడళ్ల ధరలు కూడా పెరిగాయి.
రెడ్మీ ఫోన్ల ధరలూ పైపైకి
షావోమీ తన రెడ్మీ పోర్ట్‌ఫోలియోలోని 19 వేరియంట్ల ధరలను పెంచింది. ఈ పెంపు 4.26–18.75 శాతం వరకు ఉంది. సగటున 10.02 శాతం ధరలు పెరిగాయి. రెడ్మీ ఏ7 4జీబీ+64జీబీ మోడల్ ధర రూ.13వేల నుంచి రూ.15వేలకు చేరింది. రెడ్మీ ఏ7 ప్రో ధర రూ.14వేల నుంచి రూ.16వేలకు పెరిగింది. రెడ్మీ 15ఏ సిరీస్ ధరలు కూడా రూ.2,000 నుంచి రూ.3,000 వరకు పెరిగాయి. రెడ్మీ నోట్ 17 5జీ ప్రారంభ ధర రూ.28వేల నుంచి రూ.31వేలకు చేరింది. నోట్ 17 ప్రో 5జీ వేరియంట్లపై రూ.4,000 పెరిగింది.
ప్రో మ్యాక్స్ మోడళ్ల ధరలు రూ.3,000 పెరిగాయి. రెడ్మీ టర్బో 5 ధరలు కూడా రూ.2,000 చొప్పున పెరిగాయి. మెమరీ చిప్స్, ఇతర విడిభాగాల ధరలు పెరగడంతో స్మార్ట్ఫోన్ల తయారీ ఖర్చులు అధికమవుతున్నాయి. దీంతో ధరల పెంపు తప్పడం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు వివో, ఒప్పో, మోటరోలా, రియల్మీ సంస్థలు కూడా వచ్చే వారం తమ ఫోన్ల ధరలను పెంచే అవకాశం ఉందని సమాచారం. ఇదే జరిగితే కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వినియోగదారులపై మరింత భారం తప్పదు.
