పేపర్ పులి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు..ఫిర్యాదులపై నో యాక్షన్

పేపర్ పులి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు..ఫిర్యాదులపై నో యాక్షన్
  • సమీక్ష సమావేశాలతోనే సరి 
  •      ప్రెస్​నోట్లకే పరిమితం  
  •      తూతూ మంత్రంగా తనిఖీలు
  •      ఎక్కడ తనిఖీలు చేశారో చెప్పరు 
  •      గబ్బు వాసన వదులుతున్న  కెమికల్ కంపెనీలపై చర్యలేవి? 
  •      రూల్స్​ బ్రేక్​ చేసే వారెవరో చెప్పరు.. 

హైదరాబాద్ సిటీ, వెలుగు : టీజీపీసీబీ తీరుపై ప్రజలు, పర్యావరణ ప్రేమికుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూల్స్​ఉల్లంఘించే పరిశ్రమలు, స్వీట్ తయారీ యూనిట్లు, నిర్మాణ ప్రాజెక్టులపై సీరియస్​యాక్షన్​తీసుకుంటున్నామని ప్రకటనలు చేస్తున్న పీసీబీ..ఆచరణలో ఏం చేసినట్టు కనిపించడం లేదు. తనిఖీలు చేశామని చెప్తుండటం, నామమాత్రపు ఫైన్లు వేయడం, తప్పు చేసిన సంస్థల పేర్లను సీక్రెట్​గా ఉంచడం చూస్తుంటే పీసీబీ అసలు పని చేస్తుందా అన్న అనుమనాలు కలుగుతున్నాయి.   

రూల్స్​బ్రేక్​చేసిన వారి పేర్లు చెప్పరా? 

పర్యావరణ ప్రమాణాలను పాటించకుండా, ఎలాంటి అనుమతులు లేకుండా కార్యకలాపాలు సాగిస్తున్న ఏడు ప్రధాన స్వీట్ల తయారీ యూనిట్లపై ఇటీవల పీసీబీ రోలింగ్ టాస్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్ టీమ్స్​తనిఖీలు నిర్వహించాయి. వీటిలో మూడు యూనిట్లు బోర్డు అనుమతులు లేకుండానే నడుస్తున్నట్లు, వ్యర్థ జలాలను నేరుగా మురుగు కాలువల్లోకి వదులుతున్నట్లు గుర్తించారు. అలాగే, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని ఉల్లంఘిస్తున్నందుకు ఒక్కో యూనిట్‌‌‌‌‌‌‌‌కు రూ. లక్ష చొప్పున జరిమానా విధించాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. అయితే, ఉల్లంఘనలకు పాల్పడిన ఆ స్వీట్ యూనిట్ల పేర్లేమిటి? ఎక్కడెక్కడ అవి నడుస్తున్నాయి? అనే వివరాలను మాత్రం బయటపెట్టడం లేదు. 

‘గబ్బు’ పరిశ్రమల విషయంలోనూ.. 

రాత్రయితే నగరంలో ఏదో చోట కంపు వాసన వస్తోంది. ఆ ఘాటు వాసనలకు రాత్రిళ్లు వృద్ధులు, చిన్న పిల్లలు, రోగులు నిద్రపోలేకపోతున్నారు. దీనిపై ప్రతిరోజూ పీసీబీకి ఫిర్యాదులు వస్తూనే ఉంటాయి. జీడిమెట్ల, బాలానగర్​ప్రాంతాల నుంచి ఎక్కువ కంప్లయింట్స్​రావడంతో కొద్ది రోజుల కింద ఆ ప్రాంతాల్లోని కెమికల్​ఫ్యాక్టరీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఓ ప్రెస్​నోట్​రిలీజ్​చేశారు. అయితే, అందులో ‘రెండు ఏరియాల ఫార్మా కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాం. ఘాటైన వాసనలు వస్తున్నాయని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, మళ్లీ వాసన వస్తే జరిమానా వేస్తామని చెప్పాం. 

రిపీట్​చేస్తే నోటీసులు ఇచ్చి సీజ్​చేస్తాం అని వార్నింగ్​ఇచ్చాం’ అని ఉంది. కానీ, ఫిర్యాదులు వస్తే ఫీల్డ్​లెవెల్​లో తనిఖీలు చేశారా లేదా? చేస్తే ఏయే పరిశ్రమలు కాలుష్య నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని తేలింది? గాలిలోకి విష పూరిత వాయువులను వదులుతున్నవారెవరు ? ఏం యాక్షన్​తీసుకున్నారు? అనే వివరాలు మాత్రం చెప్పడం లేదు. కేవలం సమీక్ష సమావేశాలు నిర్వహించి ఆయా కంపెనీల యాజామాన్యాలకు వార్నింగ్​ఇచ్చామని చెప్పి మీడియాకు ఓ నోట్​ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. 

18 నిర్మాణ ప్రాజెక్టులపై సమీక్ష..ఎక్కడో చెప్పలే.. 

సంగారెడ్డి జిల్లా కొల్లూరు, తెల్లాపూర్​ప్రాంతాల్లో 16 కన్​స్ట్రక్షన్​కంపెనీలు తమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయి. అయితే, ఇవి రూల్స్​బ్రేక్​చేయడం వల్ల గాలిలోకి దుమ్ము, ధూళి చేరి వాయు కాలుష్యం తీవ్రమవుతున్నది. దీనిపై టీజీపీసీబీకి కంప్లయింట్స్​రావడంతో సనత్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లోని టీజీపీసీబీ హెడ్డాఫీసులో గత శనివారం టాస్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్ కమిటీ సదరు కంపెనీలతో సమీక్ష సమావేశం జరిపింది. అయితే, వారికి ప్రాజెక్టులు నిర్మిస్తున్నప్పుడు డస్ట్ (ధూళి) బయటకు రాకుండా సూచనలు చేశామని ప్రెస్​నోట్​లో తెలిపారు. అందులో ఐదు నిర్మాణ ప్రాజెక్టులు, ఒక ఆర్ఎంసీ (రెడీమిక్స్​కాంక్రీట్​ప్లాంట్) ప్లాంట్​మూసివేతకు సిఫార్సు చేశామని చెప్పారు. 

ఇందులో భాగంగా ప్రాజెక్టుకు సంబంధించిన బ్యాంకు గ్యారంటీని జప్తు చేయాలని సూచించామన్నారు. తప్పులు సరిదిద్దుకునేందుకు10 రోజుల గడువు ఇచ్చామని  ప్రకటించారు. కానీ, రూల్స్​బ్రేక్​చేస్తున్న ఆ కంపెనీలు.. ప్రాజెక్టుల పేర్లేమిటి? అవి విడుదల చేస్తున్న ధూళి పరిమాణమెంత?  గాలి కాలుష్యం ఏ స్థాయిలో ఉంది? లాంటి కీలక సమాచారాన్ని బహిరంగపరచలేదు. అసలు ఏ నిర్మాణ సంస్థ పేరు కూడా బయటకు చెప్పకపోవడం వెనక ఉన్న మతలబు ఏమిటోనని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  

ఒత్తిళ్లు ఉన్నాయా? 
తప్పు చేసిన సంస్థల పేర్లను బహిరంగంగా వెల్లడించడానికి పీసీబీ అధికారులు ఎందుకు జంకుతున్నారు?  దీని వెనుక బడా వ్యాపారులు, రాజకీయ నాయకులు..పెద్ద స్థాయి వ్యక్తుల ఒత్తిళ్లు ఉన్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, పర్యావరణాన్ని కాలుష్యమయం చేస్తున్న వారిని శిక్షించాల్సింది పోయి, వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా టీజీపీసీబీ అధికారులు పారదర్శకత పాటించాలని, రూల్స్​బ్రేక్​చేసే కంపెనీల పేర్లను బహిర్గతం చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.