టీచర్లు లేరు.. సదువు చెప్తలేరు : పిల్లల ప్రజావాణిలో చిన్నారుల గోడు

టీచర్లు లేరు.. సదువు చెప్తలేరు : పిల్లల ప్రజావాణిలో చిన్నారుల గోడు
  • చన్నీళ్ల స్నానం చేయలేక పోతున్నం.. 
  • సమయానికి బ్రేక్ ఫాస్ట్ పెడ్తలేరు.. 
  • ఖాళీ కడుపుతో క్లాసులకు పోతున్నం
  • స్కూళ్ల పక్కనే సిగరెట్, గుట్కా అమ్మకాలు
  • వైద్యానికి సాయం కోరిన తలసేమియా బాలిక

 
వరంగల్‍/ఖమ్మం/నిర్మల్​, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లలో సోమవారం చిన్నారుల సందడి నెలకొంది. స్కూళ్లు, హాస్టళ్లలో ఎదురవుతున్న సమస్యలను కలెక్టర్లకు చెప్పుకునేందుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా అన్ని జిల్లాల్లో నిర్వహించిన ‘పిల్లల ప్రజావాణి’లో తమ గోడు వెళ్లబోసుకున్నారు. కలెక్టర్లు చిన్నారులను ఆప్యాయంగా పలకరించి, వారి సమస్యలను ఓపికగా విన్నారు. పరిష్కరించాల్సిన అంశాలపై సంబంధిత అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలిచ్చారు. 

హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌‌‌‌పాయ్‌‌‌‌ను పలువురు విద్యార్థులు కలిసి స్కూళ్లు, హాస్టళ్లలోని ఇబ్బందులను వివరించారు. సబ్జెక్ట్ టీచర్లు లేక చదువులు సాగడం లేదని, ఉదయం బ్రేక్‌‌‌‌ఫాస్ట్ సమయానికి అందక ఖాళీ కడుపుతో తరగతులకు వెళ్లాల్సి వస్తున్నదని చెప్పారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, హాస్టళ్లలో కనీస సౌకర్యాలు లేవని వాపోయారు. చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేయలేక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. స్కూళ్ల సమీపంలోని పాన్‌‌‌‌షాపుల్లో సిగరెట్లు, గుట్కాలు విక్రయిస్తున్నారని కొందరు ఫిర్యాదు చేశారు.
 

బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మార్గదర్శకాలతో రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 14 నుంచి 20 వరకు బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా చిన్నారులు, విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు సోమవారం అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా 'పిల్లల ప్రజావాణి' ఏర్పాటు చేసింది. కలెక్టర్లతోపాటు విద్య, వైద్యం, బాలల హక్కుల పరిరక్షణ, సంక్షేమ శాఖలకు చెందిన అధికారులు అందుబాటులో ఉన్నారు. ఖమ్మం కలెక్టరేట్‌‌లో 19 మంది చిన్నారులు అర్జీలు అందజేశారు. 

అనారోగ్య సమస్యలకు ఆర్థిక సాయం, ఆధార్, బర్త్ సర్టిఫికెట్లు, సదరం సర్టిఫికెట్లు ఇప్పించాలని కోరారు. కలెక్టర్ దివాకర, అడిషనల్ కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాస్ రెడ్డి అర్జీలు స్వీకరించారు. వాటిని వెంటనే పరిష్కరించాలని, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల, జిల్లా బాలల పరిరక్షణ అధికారిణి విష్ణువందన, కార్మిక అధికారిణి వెంగమాంబ పాల్గొన్నారు. నిర్మల్‌‌లో నిర్వహించిన పిల్లల ప్రజావాణికి 16 ఫిర్యాదులు అందాయి. తలసేమియాతో బాధపడుతున్న అనంతపేటకు చెందిన కుంటాల సాన్విక మెరుగైన వైద్యం కోసం మిషన్ వాత్సల్య పథకం కింద ఆర్థిక సాయం చేయాలని కోరింది. అక్కాపూర్ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్‌‌కు ప్రహరీ గోడ నిర్మించాలని విద్యార్థులు విజ్ఞప్తి చేశారు.
 
క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం తిరుగుతున్నా

మా కుటుంబం 30 ఏండ్లుగా హనుమకొండలోనే ఉంటున్నది. నేను తొలి సంతానం కావడంతో పురుడు కోసం అమ్మ కర్నాటకలోని తన సొంతూరుకు వెళ్లింది. 2009లో అక్కడే పుట్టినా కొద్ది రోజులకే హనుమకొండకు వచ్చేశాం. నర్సరీ నుంచి పదో తరగతి వరకు ఇక్కడే చదువుకున్నా. నాలుగేళ్ల క్రితం నాన్న గుండెపోటుతో ఆకస్మికంగా చనిపోయారు. క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగినా పని కావడం లేదు. కలెక్టర్ మేడం స్పందించి సర్టిఫికెట్ ఇప్పించాలి.-హన్నందాస్ దీప, హనుమకొండ
 
చన్నీళ్ల స్నానమంటే ఏడుపోస్తంది

చలికాలం తీవ్రత పెరిగింది. గురుకులంలో ఉదయం బయటకు రావా లంటేనే గజగజ వణుకు తున్నాం. తెల్లవారుజా మున చన్నీళ్లతో స్నానం చేయాలంటే ఏడుపొస్తున్నది. అధికారులు స్పందించి సోలార్ వాటర్ హీటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి.- జి. స్వీటి, కేజీబీవీ,వేలేరు మండలం, హనుమకొండ
 
బ్రేక్‌‌ఫాస్ట్ టైముకు రావట్లే

మా స్కూల్‌‌లో ఉదయం ఇచ్చే బ్రేక్‌‌ఫాస్ట్ ఆలస్యంగా వస్తున్నది. టిఫిన్ పెడతారని ఇంటి దగ్గర తినకుండా వస్తున్నాం. చాలాసార్లు ఖాళీ కడుపుతోనే క్లాసులకు వెళ్లాల్సి వస్తున్నది. 
-అక్షర, గర్ల్స్ హైస్కూల్, హనుమకొండ
 
హిందీ టీచర్ లేక ఇబ్బంది

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లలో మర్కజీ హైస్కూల్‌‌కు మంచి పేరుంది. ఎంతోమంది మేధావులు చదువుకున్న ఈ స్కూల్‌‌లో చదువుకోవడం ఆనందంగా ఉంది. కానీ మాకు హిందీ టీచర్ లేరు. దీంతో ఆ సబ్జెక్టులో సరిగ్గా పాఠాలు చెప్పేవారు లేక చదువులో నష్టపోతున్నాం. వెంటనే టీచర్‌‌ను నియమించాలి.
-సాయి ముఖేష్, మర్కజీ హైస్కూల్