ప్రమాదంలో రోహిత్‌‌‌‌ కెరీర్.. సెలెక్షన్‌‌ కమిటీ నిర్ణయంపై ఆధారపడ్డ హిట్‌‌మ్యాన్‌‌ ఫ్యూచర్..!

ప్రమాదంలో రోహిత్‌‌‌‌ కెరీర్.. సెలెక్షన్‌‌ కమిటీ నిర్ణయంపై ఆధారపడ్డ హిట్‌‌మ్యాన్‌‌ ఫ్యూచర్..!

ఆక్లాండ్‌‌: 0, 23, 0, 7.. న్యూజిలాండ్‌‌తో ఆడిన నాలుగు వన్డేల్లో రోహిత్‌‌ శర్మ చేసిన రన్స్‌‌ ఇవి. ఒకప్పుడు విదేశీ పిచ్‌‌లపై పరుగుల వర్షం కురిపించిన హిట్‌‌మ్యాన్‌‌ ఈసారి పూర్తిగా తడబడ్డాడు. పేస్‌‌ బౌలింగ్‌‌ను ఎదుర్కొనడంలోనూ తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. కనీసం విరాట్ కోహ్లీ ఒక్క మ్యాచ్‌‌లోనైనా హాఫ్‌‌ సెంచరీ సాధించాడు. కానీ రోహిత్‌‌లాంటి బ్యాటర్‌‌ కనీస ప్రదర్శన కూడా చూపెట్టకపోవడంతో ఇప్పుడు అతని భవితవ్యంపై సర్వత్రా చర్చ మొదలైంది. 

ఒకప్పుడు శిక్షణ శిబిరాల్లో రోహిత్‌‌తో కలిసి ఆడిన చీఫ్‌‌ సెలెక్టర్‌‌ ప్రజ్ఞాన్‌‌ ఓజా.. హిట్‌‌మ్యాన్‌‌పై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని విమర్శకులు వ్యాఖ్యానాలు మొదలుపెట్టారు. వచ్చే ఏడాది సౌతాఫ్రికాలో జరిగే వన్డే వరల్డ్‌‌ కప్‌‌లో ఆడాలని రోహిత్‌‌ లక్ష్యంగా పెట్టుకున్నా.. ప్రస్తుత ఫామ్‌‌ ప్రకారం అతన్ని సెలెక్షన్‌‌ కమిటీ కొనసాగిస్తుందా..? గణాంకాలను చూపించి మెల్లగా తప్పిస్తుందా..? అన్నది ఇప్పుడు మిలియన్‌‌ డాలర్ల ప్రశ్న.

ఆరు వన్డేలు మాత్రమే..

వచ్చే ఏడాది అక్టోబర్‌‌ 9న సౌతాఫ్రికాలో వన్డే వరల్డ్‌‌ కప్‌‌ మొదలుకానుంది. ఇందుకోసం జట్టును సిద్ధం చేయడానికి టీమిండియాకు శ్రీలంక, జింబాబ్వేతో చెరో మూడు మాత్రమే ఆడే చాన్స్‌‌ ఉంది. స్వదేశంలో ఫ్లాట్‌‌ పిచ్‌‌లపై జరిగే ఈ రెండు సిరీస్‌‌ల్లో రోహిత్‌‌ పరుగుల వర్షం కురిపిస్తాడని అందరూ అంచనా వేస్తున్నారు. అయితే ఇండియాలో వెస్టిండీస్‌‌తో జరిగిన సిరీస్‌‌లో హిట్‌‌మ్యాన్‌‌ అద్భుతంగా రన్స్‌‌ రాబట్టాడు. కానీ కివీస్‌‌కు వెళ్లేసరికి ఆ రన్స్‌‌కు ప్రాధాన్యత లేకుండా పోయాయి. 

ఇప్పుడు ఐపీఎల్ వరకు దాదాపు మూడు నెలలు రోహిత్‌‌ ఖాళీగానే ఉండనున్నాడు. ఈ టైమ్‌‌లో ఫామ్‌‌ను ఎలా కాపాడుకుంటాడు..? వరల్డ్ కప్‌‌ జట్టులో చోటు ఎలా సంపాదిస్తాడు..? అనేదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అయితే డొమెస్టిక్‌‌ క్రికెట్‌‌లో ఆడితే బాగుంటుందని సలహా ఇస్తున్నా.. ఆ దిశగా హిట్‌‌మ్యాన్‌‌ అడుగులు వేస్తాడా..? చూడాలి. రోహిత్‌‌ పరుగులు చేయకపోవడం సమస్య కాదు.. ఔటైన తీరే బాధిస్తోందని గంభీర్‌‌ అనడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. 

పేస్‌‌, బౌన్స్‌‌, సీమ్‌‌ మూవ్‌‌మెంట్‌‌ను ఎదుర్కోవడంలో రోహిత్‌‌ విఫలమవుతున్నాడు. సౌతాఫ్రికా పిచ్‌‌లపై ఈ మూడు ఉంటాయి. కాబట్టి ఈ సమస్యను హిట్‌‌మ్యాన్‌‌ ఎలా అధిగమిస్తాడు..? రోహిత్ మనసు ఇంకా ఆడాలని కోరుకుంటున్నప్పటికీ, కొన్నిసార్లు అతని శరీరం, ప్రతిచర్యలు సమన్వయం కావడం లేదు. కాబట్టి రెండు దశాబ్దాలుగా భారత క్రికెట్‌‌కు సేవలందించిన వారికి సరైన వీడ్కోలు లభించాలి. కానీ అది ఏ రూపంలో అన్నది ఓజానే తేల్చాల్సి ఉంది. 

చాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పటికీ అగార్కర్ 'హిట్‌‌మ్యాన్'ను వన్డే నాయకత్వం నుండి తొలగించడం వారిద్దరి వ్యక్తిగత స్నేహాన్ని దెబ్బతీసిందన్నది రహస్యమేమీ కాదు. కానీ న్యూజిలాండ్ టూర్‌‌ తర్వాత  రోహిత్ వైఖరి ఏమిటో ఓజాకు తెలియాలి, అలాగే ప్రపంచ కప్‌‌కు ముందు సెలక్షన్ కమిటీ ప్రణాళికపై రోహిత్‌‌కు కూడా ఓ స్పష్టత కావాలి. వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే వన్డే సిరీస్‌‌లో జింబాబ్వేతో జరిగే చివరి మ్యాచ్ ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియంలో జరగనుంది. అప్పుడు రోహిత్ కథలో ఏదైనా మలుపు ఉంటుందా..?

ఇంగ్లండ్‌‌ టూర్‌‌లోనే..

ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఇంగ్లండ్‌‌ టూర్‌‌ తర్వాత రోహిత్‌‌కు వీడ్కోలు ఇవ్వాలని చీఫ్‌‌ సెలెక్టర్‌‌ అజిత్‌‌ అగార్కర్‌‌ దాదాపుగా ప్లాన్‌‌ సిద్ధం చేశాడు. ఆ క్రమంలో ఇంగ్లండ్‌‌తో వన్డే సిరీస్‌‌కు ముందు ఇప్పుడున్న చీఫ్‌‌ సెలెక్టర్‌‌ ఓజా.. రోహిత్‌‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యాడు. లార్డ్స్‌‌లో రిటైర్మెంట్‌‌ ప్రకటించేందుకు రోహిత్‌‌ సిద్ధంగా ఉన్నాడా..? లేదా..? అనేది తెలుసుకోవడమే ప్రధాన ఉద్దేశం. కానీ ఆ ప్రతిపాదన రోహిత్‌‌కు ఏమాత్రం నచ్చలేదు.

 దాంతో తన అసంతృప్తిని బీసీసీఐ పెద్దలకు స్పష్టంగా తెలియజేశాడు. వెంటనే బీసీసీఐ సెక్రటరీ సైకియా జోక్యం చేసుకుని రోహిత్‌‌ వరల్డ్‌‌ కప్‌‌ పరిగణనలో ఉన్నాడని స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు. దాంతో రిటైర్మెంట్‌‌కు అనూహ్యంగా ఫుల్‌‌స్టాప్‌‌ పడటంతో.. అగార్కర్‌‌ చీఫ్ సెలెక్టర్‌‌ పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయాడు. అగార్కర్‌‌ నిష్క్రమణతో ఇప్పుడు బాధ్యత అంతా ఓజాపై పడింది. 

మరోవైపు ఎవరి పేరు ప్రస్తావించకుండా.. కివీస్‌‌ సిరీస్‌‌లో టాప్‌‌ ఆర్డర్‌‌ పదేపదే విఫలం కావడం ఆందోళనకరమని హెడ్‌‌ కోచ్‌‌ గౌతమ్‌‌ గంభీర్‌‌ వ్యాఖ్యానించడం కూడా ఇప్పుడు చర్చను పెద్దది చేస్తోంది. ఏదేమైనా బ్యాటింగ్‌‌లో ఉన్న లోపాలను అద్భుతమైన బౌలింగ్‌‌తో అధిగమించిన ఇండియా 3–1తో సిరీస్‌‌ను సొంతం చేసుకోవడం కాస్త ఉపశమనాన్ని ఇచ్చింది.