- 20న నెల్లూరు–తుని మధ్య తీరం దాటే చాన్స్
- నవంబర్ 20 నుంచి రాష్ట్రంలో వానలు
- 20, 21న తూర్పు తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్
- 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి మరో తుఫాన్ వానల ఆశలు రేపుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలపడి ‘ఆక్వాన్’ తుఫాన్‌గా మారింది. దీని ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలోనూ ఈ నెల 20 నుంచి 22 వరకు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం సోమవారం సాయంత్రం 5.30 గంటలకు తుఫాన్‌గా బలపడిందని ఐఎండీ వెల్లడించింది. ఈ తుఫాన్ ఉత్తర–వాయువ్య దిశగా వేగంగా తీరం వైపు దూసుకొస్తోంది. మంగళవారం (17న) సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా, గురువారం (19న) నాటికి అతి తీవ్ర తుఫాన్‌గా బలపడి, శుక్రవారం (20న) నెల్లూరు–తుని మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
తూర్పు జిల్లాల్లో భారీ వర్షాలు
20న భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 20, 21 తేదీల్లో ఈ నాలుగు జిల్లాలతో పాటు నల్గొండ, ములుగు జిల్లాల్లో ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వానలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. తూర్పు తెలంగాణలో 70 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.
