- పోలీస్ కస్టడీలో గుట్టు విప్పిన నిందితులు
- 120 నకిలీ ఆధార్ కార్డులు, ఇతర పత్రాల తయారీ
- ముగ్గురు బ్రోకర్ల ఖాతాల్లో రూ.56.89 లక్షలు జమ
- 17 ఫెర్టిలిటీ సెంటర్లతో లావాదేవీలు.. 14 సెంటర్లకు నోటీసులు
- ఒయాసిస్ సెంటర్ ఇద్దరు మేనేజర్లు అరెస్ట్
- 10కి చేరిన అరెస్టులు.. సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ
హైదరాబాద్, వెలుగు: పోలీస్‌కస్టడీలో ఉన్న నిందితులిచ్చిన సమాచారం మేరకు అండాల అక్రమ దందా కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఒక్కసారి అండదానం చేస్తే సుమారు రూ.50 వేలు ఇస్తామని ఆశ చూపి మహిళలను తీసుకొచ్చినట్లు, ఈమేరకు మాఫియా రేట్ ఫిక్స్ చేసినట్లు బయటపడింది. ఏఆర్టీ, ఫెర్టిలిటీ సెంటర్ల నుంచి ప్రధాన నిందితుడు అమిత్ శర్మ, నిఖత్ పర్వీన్, గులాం మొయినుద్దీన్ ఖాతాల్లో రూ.56.89 లక్షలు జమ అయినట్లు పోలీసులు గుర్తించారు. అమిత్ ఖాతాలో రూ.27.22 లక్షలు, నిఖత్ ఖాతాలో రూ.18.30 లక్షలు, గులాం ఖాతాలో రూ.11.36 లక్షలు జమైనట్లు తేల్చారు.
మరో నిందితురాలు రేష్మా ఖాతూన్ ఖాతాలో 2025 జనవరి 25 నుంచి 2026 అక్టోబర్ 26 వరకు సుమారు రూ.75 లక్షల డిపాజిట్ అయినట్లు పోలీసుల విచారణలో తేలింది. 13వ నిందితుడిగా ఉన్న మునుగపాటి ప్రవీణ్‌కుమార్ యువతుల కోసం 120 నకిలీ ఆధార్‌కార్డులు, ఇతర నకిలీ పత్రాలను తయారు చేసినట్లు బయటపడింది. యువతుల ప్రయాణం, వసతి, వైద్య కేంద్రాలకు తరలింపు మొత్తాన్ని ఏజెంట్లు సమన్వయం చేసినట్లు గుర్తించారు.
కస్టడీలో నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు ఇప్పటికే ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్‌కు చెందిన జూబ్లీహిల్స్ బ్రాంచ్ మేనేజర్ మూరెళ్ల నరసింహారావు, షేక్‌పేట మేనేజర్ శరత్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 10కి చేరింది. కాగా, ఎనిమిది మంది నిందితుల కస్టడీ ముగియడంతో సోమవారం ఉదయం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌కు తరలించారు.
బ్రోకర్ల నుంచి అండాలు సేకరించిన ఒయాసిస్, సద్గురు, నర్మద ఫెర్టిలిటీ క్లినిక్, బటర్‌ఫ్లై బయో, నోవా ఐవీఎఫ్, ఇందిరా ఐవీఎఫ్, ఫెర్టీ9, క్లౌడ్‌నైన్‌తో పాటు 14 ఫర్టిలిటీ సెంటర్లు, ఏఆర్టీలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో డోనర్ల నమోదు, అగ్రిమెంట్లు, వైద్య పరీక్షలు, చెల్లింపులు, ఏజెంట్ల వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో ఏఆర్టీ, ఐవీఎఫ్ కేంద్రాలు నిబంధనలను పాటించలేదని గుర్తించారు. ముఖ్యంగా యువతులను నకిలీ ఆధార్ కార్డులతో ఫెర్టిలిటీ సెంటర్లకు తరలించినట్లు తేల్చారు. బాధితుల వాంగ్మూలం ఆధారంగా మరిన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతోనూ సమన్వయం చేసుకుంటున్నట్లు సమాచారం.
14 సెంటర్లకు నోటీసులు ఇచ్చాం–సీపీ సుమతి
నిందితులకు 17 ఫెర్టిలిటీ కేంద్రాలతో ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు గుర్తించామని, వాటిలో 14 కేంద్రాలకు నోటీసులు జారీ చేశామని మేడ్చల్ మల్కాజ్గిరి సీపీ సుమతి తెలిపారు. బాధితులు, ఆస్పత్రుల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలతో పాటు నిందితుల బ్యాంకు ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. పోలీస్ కస్టడీలో ఉన్న నిందితులను విడివిడిగా విచారించామని, ఈ సందర్భంగా డోనర్లను ఏజెంట్లు ఏ విధంగా గుర్తిస్తున్నారు? ఎక్కడి నుంచి తరలిస్తున్నారు? అనే అంశాలపై కీలక సమాచారం సేకరించినట్లు తెలిపారు. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో ఏఆర్టీ, ఐవీఎఫ్ కేంద్రాలు నిబంధనలను పాటించలేదని గుర్తించినట్లు పేర్కొన్నారు. డోనర్ల రిక్రూట్‌మెంట్ హైదరాబాద్ కేంద్రంగానే జరిగిందా? ఇతర రాష్ట్రాల్లోనూ ఈ నెట్‌వర్క్ విస్తరించిందా? అనే కోణాల్లోనూ విచారణ సాగుతోందని తెలిపారు.
