గండిపేట, వెలుగు : పెంపుడు చిలుక కోసం వెతుకుతున్న తొమ్మిదేండ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించిన కేసులో నిందితుడికి రాజేంద్రనగర్‌లోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 20 ఏండ్లు జైలు శిక్ష వేసింది. నార్సింగి పీఎస్ పరిధిలోని కోకాపేట సన్‌షైన్ ఎకో పోలిస్ అపార్ట్‌మెంట్స్‌లో 2024 ఆగస్టు 21న తొమ్మిదేండ్ల చిన్నారి..కనిపించకుండాపోయిన తన పెంపుడు చిలుక కోసం వెతుకుతోంది. అదే అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న అసోంకు చెందిన రనోజ్ తాయే (23) చిలుకను చూపిస్తానని ఐదో అంతస్తులోని టెర్రస్‌పైకి తీసుకువెళ్లాడు.
లైంగిక దాడికి యత్నించగా బాలిక ప్రతిఘటించింది. అతడిని పక్కకు నెట్టి ఏడుస్తూ రెండో అంతస్తుకు పరుగెత్తింది. తల్లికి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పక్కా సాక్ష్యాలు ప్రవేశపెట్టడం, విచారణలో నిందితుడిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి టి. శ్రీనివాస్ నిందితుడికి 20 ఏండ్ల శిక్ష విధించారు. బాధిత బాలికకు రూ.3 లక్షల పరి హారం అందించాలని ఆదేశించారు. నిందితుడికి కఠిన శిక్ష పడడంలో అప్పటి సీఐ హరికృష్ణారెడ్డి, ప్రస్తుత ఎస్‌హెచ్‌ఓ విష్ణువర్ధన్‌రెడ్డి, సీడీఓ అంజిలప్ప, సమన్ల సిబ్బంది నిరంజన్ గౌడ్, పీపీ వెంకటేశ్వర్‌రెడ్డి, లైజనింగ్ ఆఫీసర్ శివారెడ్డి, సైబరాబాద్ భరోసా సెంటర్ లీగల్ కౌన్సిలర్లు పవిత్ర, అంజలి కీలక పాత్ర పోషించారని ఉన్నతాధికారులు అభినందించారు.
