అబద్ధాలకు జవాబు నా ఆత్మకథ.. మా కుటుంబంపై ఎన్నో అవాస్తవాలు రాశారు: సోనియా

 అబద్ధాలకు జవాబు  నా ఆత్మకథ.. మా కుటుంబంపై ఎన్నో అవాస్తవాలు రాశారు: సోనియా
  • అందుకే నా మనసులో మాటగా ఈ పుస్తకం
  • బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకావిష్కరణలో సోనియా
  • ఇందిర, రాజీవ్ హత్యల గురించి రాయడమే కష్టమైంది
  • రాజీవ్ పోయాక పసిపాపనయ్యా.. పిల్లలే తల్లిదండ్రులైన్రు
  • అత్త ఇందిరా గాంధీని చూస్తే మొదట్లో  భయపడేదాన్ని
  • ప్రధాని పదవిపై ‘ఠీక్ హై’ నుంచి కచ్చితంగా ‘నో’ వరకు 
  • ఆత్మకథలోని అంశాలను ప్రస్తావించిన సోనియా గాంధీ 

 

న్యూఢిల్లీ: తన కుటుంబం గురించి ఎన్నో అవాస్తవాలు రాశారని, అందుకే తన మనసులోని భావాలను పంచుకోవాలని ఆత్మకథ రాశానని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌‌‌‌పర్సన్ సోనియా గాంధీ అన్నారు. ‘మా అత్తగారి గురించి, భర్త, కొడుకు, బిడ్డ.. మా కుటుంబం గురించి ఎన్నో మాటలు అన్నారు. వాటిలో చాలావరకు కల్పిత కథలే, బాధపెట్టే మాటలే. నా భావాలను, నా కుటుంబం గురించి నిజాలను చెప్పేందుకే ఈ పుస్తకం’ అని చెప్పారు. 

 

సోమవారం ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌‌‌‌లో తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ అధికారిక ఆవిష్కరణ కార్యక్రమంలో హార్పర్‌‌‌‌కాలిన్స్ ఇండియా ప్రతినిధితో సంభాషణలో ఆమె మాట్లాడారు. అత్తగారు ఇందిరా గాంధీ, భర్త రాజీవ్ గాంధీ హత్యల గురించి రాయడమే తనకు అత్యంత కష్టమైందని చెప్పారు. రాజీవ్‌‌‌‌తో తన ప్రేమ ఓ మాయాజాలంలా సాగిందని గుర్తుచేసుకున్నారు.

మొదలుపెట్టాక ఆనకట్ట తెగినట్టే

తన మనసులోని భావాలు బయటపెట్టేందుకు ఎప్పుడూ వెనుకాడేదాన్నని, రాహుల్, ప్రియాంక, మంజులిక దూబే పట్టుబట్టడంతోనే రాయడానికి ఒప్పుకున్నానని సోనియా చెప్పారు. ‘మొదట్లో కష్టమైంది. కానీ మొదలుపెట్టాక ఆనకట్ట తెగినట్టే రాసుకుంటూ పోయా’ అన్నారు. తాను ఎప్పుడూ డైరీ రాయలేదని, పుస్తకంలోని విషయాలన్నీ జ్ఞాపకాల నుంచే రాశానని తెలిపారు. పాఠకుల నుంచి వస్తున్న స్పందన చూసి ఉప్పొంగిపోతున్నానని, ఇంత ప్రేమ ఊహించలేదని చెప్పారు. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో కొన్ని విమర్శలు కటువుగా ఉన్నా, కొన్ని నిజాయితీగా ఉన్నాయన్నారు.

 ‘బిలాంగింగ్’ (చెందడం) అనే పేరు ఎందుకు పెట్టారో వివరిస్తూ.. కొత్త కుటుంబానికి, కొత్త దేశానికి చెందినదాన్ని కావడానికి తాను ఎంతగా ప్రయత్నించానో ఆ పేరు చెబుతుందని సోనియా అన్నారు. ఇండియాలో పెండ్లయిన చాలామంది మహిళలదీ ఇదే పరిస్థితి అని, ఒకే నేపథ్యం నుంచి వచ్చినా కొత్త ఇంట్లో సర్దుకుపోవడం కష్టమేనని చెప్పారు. ఇందిరా గాంధీ కోడలిగా వచ్చినప్పుడు ఇటలీలో ఉన్నంత సాధారణ వాతావరణం ఉండేది కాదని, మొదట్లో ఇందిరను చూస్తే భయమేసేదని, ఆమెను ‘మమ్మీ’ అని పిలవడానికి టైమ్ పట్టిందని గుర్తుచేసుకున్నారు.

 పెద్దలను గౌరవించాలనే ఇటలీ పెంపకమే తనకు అక్కడ ఉపయోగపడిందన్నారు. రాజీవ్ రాజకీయాల్లోకి రావడాన్ని తాను గట్టిగా వ్యతిరేకించానని, కుటుంబంతో గడిపే టైమ్ పోతుందనే స్వార్థం కావొచ్చని చెప్పారు. ‘మా జీవితం మారిపోయింది. కానీ ఆయన దొరికిన కొద్ది టైమే ఇంకా విలువైనదిగా మారి మా బంధం బలపడింది’ అన్నారు.   రాజీవ్ గాంధీ మరణం తర్వాత తాను ఒక చిన్నపిల్లలా మారిపోయానని, ఆ కష్టకాలంలో తన పిల్లలు రాహుల్, ప్రియాంకలే తనకు తల్లిదండ్రులుగా మారి నడిపించారని గుర్తుచేసుకున్నారు.

వారంలోపే 2 లక్షల కాపీలు

గత మంగళవారం మార్కెట్లోకి విడుదలైన ఈ పుస్తకానికి పాఠకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. విడుదలైన వారం రోజుల్లోపే 2 లక్షలకు పైగా కాపీలు అమ్ముడయ్యాయని ప్రచురణకర్త హార్పర్‌కాలిన్స్ వెల్లడించింది. ఇటలీలోని టురిన్ సమీపంలో గడిచిన బాల్యం నుంచి ఇండియాలో అడుగుపెట్టి, నెహ్రూ-గాంధీ కుటుంబ కోడలిగా, కాంగ్రెస్ అధినేత్రిగా మారిన ఆరు దశాబ్దాల ప్రయాణాన్ని ఇందులో కళ్లకు కట్టారు.

కదిలొచ్చిన ఇండియా కూటమి

కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంకాతో పాటు తెలంగాణ సీఎం రేవంత్, తమిళనాడు సీఎం విజయ్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్, కర్నాటక సీఎం డీకే, హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు, ఎస్పీ చీఫ్ అఖిలేశ్, ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, ఎన్సీపీ (ఎస్పీ) నేత సుప్రియా సూలే హాజరయ్యారు.  

2004లో యూపీఏ అధికారంలోకి వచ్చినప్పుడు..

హార్పర్‌‌‌‌కాలిన్స్ ఇండియా ప్రచురించిన ఈ పుస్తకంలో 2004 నాటి కీలక రాజకీయ పరిణామాలను సోనియా వివరించారు. యూపీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రధాని పదవి చేపట్టేందుకు తాను మొదట ససేమిరా అన్నానని తెలిపారు. ఆ తర్వాత మిత్రపక్షాల ఒత్తిడి మేరకు బలహీనమైన స్వరంతో ‘ఠీక్ హై’ (సరే) అన్నప్పటికీ, చివరకు తన అంతరాత్మ ప్రబోధం మేరకు కచ్చితంగా ‘నో’ (ప్రధాని పదవి వద్దు) అని నిర్ణయించుకున్న తీరును ఇందులో పొందుపరిచారన్నారు. 

రాజీవ్ ప్రధానిగా ఉన్నప్పుడు భద్రతా కారణాల వల్ల రాహుల్, ప్రియాంకలను ఇంటి నుంచి బయటకు వెళ్లనిచ్చేవారు కాదని గుర్తుచేసుకున్నారు. తన పుస్తకంపై వస్తున్న విమర్శల గురించి ప్రస్తావిస్తూ.. కొన్ని నిజాయితీగా ఉన్నాయని, మరికొన్ని మాత్రం చాలా కఠినంగా, అసూయతో కూడినవిగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.