కొలూన్ (హాంకాంగ్): ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా ఇండియా స్టార్ షట్లర్ లక్ష్య సేన్ హాంకాంగ్ ఓపెన్ సూపర్ –500 టోర్నీకి సిద్ధమయ్యాడు. ఇటీవలే హైలో ఓపెన్, కుమమోటో మాస్టర్స్ జపాన్ టోర్నీల్లో వరుస టైటిళ్లతో చెలరేగిన 25 ఏళ్ల లక్ష్య.. వరల్డ్ టూర్ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి ఎగబాకాడు. అయితే హాంగ్జౌలో జరిగే సీజన్ ఎండింగ్ ఫైనల్స్‌లో బెర్త్ పూర్తిగా ఖరారు కావాలంటే ఈ టోర్నీలో కనీసం సెమీఫైనల్స్ చేరాల్సి ఉంది.
మరోవైపు కొకి వాటనాబె, కున్లావుట్ విటిద్సార్న్ సైతం రేసులో ఉండటంతో పోటీ రసవత్తరంగా మారింది. తొలి రౌండ్‌లో స్థానిక ఆటగాడు లీ చుక్ ఇయితో లక్ష్య తలపడనున్నాడు. ఒకవేళ ఇటు లక్ష్య, అటు కున్లావుట్ తమ తొలి మ్యాచ్‌లు గెలిస్తే రెండో రౌండ్‌లో ఇద్దరి మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది. మెన్స్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ బరిలో ఉంది. విమెన్స్ సింగిల్స్‌లో అన్మోల్ ఖర్బ్, ఉన్నతి హూడా, అస్మిత చాలిహా సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.
