బుడాపెస్ట్: టోటల్ చెస్ వరల్డ్ చాంపియన్‌షిప్ టూర్ పైలట్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగైసికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం జరిగిన గ్రూప్–డి ఆఖరి మ్యాచ్‌లో ఆర్. వైశాలి చేతిలో ఓడిన అర్జున్ నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించాడు. గ్రూప్ దశ ప్రారంభంలో అర్జున్ అగ్రస్థానంలో నిలిచి నాకౌట్ బెర్త్‌కు చేరువయ్యాడు. వైశాలిపై తొలి గేమ్‌లో విజయం సాధించి రెండు పాయింట్ల ఆధిక్యం సంపాదించాడు.
అయితే, రివర్స్ గేమ్‌లో వైశాలి అద్భుత ఆటతీరు కనబరిచి అర్జున్‌కు చెక్ పెట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఇద్దరూ తప్పులు చేసినా, చివరకు వైశాలి విజయం సాధించింది. ఈ ఫలితంతో మాక్సిమ్ వాచియర్ లాగ్రేవ్ నాకౌట్‌కు అర్హత సాధించగా, అర్జున్ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఇండియన్ గ్రాండ్‌మాస్టర్లందరూ క్లాసిఫికేషన్ స్థానాల కోసం తలపడనున్నారు.
