తెలంగాణలో నిర్మించిన సమ్మక్క సాగర్ (తుపాకులగూడెం) బ్యారేజీకి అనుమతుల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టుకు ఎన్ ఓసీ మంజూరు చేయడంతో పాటు మిగిలిన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది
ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మినిస్టర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయితో సమావేశమయ్యారు. సమ్మక్క సాగర్ బ్యారేజీకి వెంటనే ఎన్ ఓసీ జారీ చేయడంతో పాటు ప్రాజెక్టుకు అవసరమైన ఇతర అనుమతుల విషయంలో సహకరించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో తెలంగాణలో పెరుగుతున్న నీటి అవసరాలను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. వాతావరణ పరిస్థితుల మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలో నీటి అవసరాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద సమ్మక్క సాగర్ బ్యారేజీ నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని, అందులో నీటిని నిల్వ చేసుకునేందుకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కోరారు.
పూర్తి స్థాయి నీటి మట్టం +83 మీటర్ల వద్ద సమ్మక్క సాగర్ బ్యారేజీ నిల్వ సామర్థ్యం 6.94 టీఎంసీలుగా ఉందని సీఎం వివరించారు. కరువు ప్రభావిత, వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లో సాగునీరు, తాగునీటి అవసరాలను తీర్చడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
ALSO READ : గ్లోబల్ సమ్మిట్ ను వాయిదా వేయండి..?
బ్యారేజీ నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో నీటి నిల్వకు అనుమతులు లభిస్తే గోదావరి జలాలను ఆయా ప్రాంతాల అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ సహకారం కోరుతూ రేవంత్ రెడ్డి జరిపిన సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
