రికార్డులో ఆన్ డ్యూటీ.. ఫామ్‌హౌస్‌లో చిందులు.. బెల్లంపల్లి 1 టౌన్ పోలీసుల వీడియో వైరల్

రికార్డులో ఆన్ డ్యూటీ.. ఫామ్‌హౌస్‌లో చిందులు.. బెల్లంపల్లి 1 టౌన్ పోలీసుల వీడియో వైరల్

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్ టౌన్ పోలీసులకు సంబంధించిన వ్యవహారం విమర్శలపాలవుతోంది. విధులు నిర్వర్తించాల్సిన సమయంలో ఫామ్ హౌస్ లో విందులు చేసుకోవడం డిపార్టుమెంటులో చర్చనీయాంశంగా మారింది. పట్టపగలే వర్షంలో డ్యాన్స్ చేస్తూ చిందులేసిన వీడియో వైరల్ గా మారింది. 

వివరాల్లోకి వెళ్తే.. 2026 నవంబర్ 15 (ఆదివారం)  బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పలువురు సిబ్బంది ఫామ్ హౌజ్ లో పార్టీ చేసుకున్నారు. అయితే రికార్డులో మాత్రం డ్యూటీలో ఉన్నట్లు నమోదు కావడంతో ఈ విషయం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఆదివారం కావడంతో రికార్డుల్లో సంతకాలు పెట్టి గుట్టుచప్పుడు కాకుండా ఓ ప్రైవేట్ ఫామ్‌హౌస్‌ కు వెళ్లినట్లు తెలుస్తోంది.  పట్టపగలు వర్షంలో డ్యాన్స్‌లు, స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాటల్లో మునిగి తేలుతూ విందు వినోదాలు చేసుకున్నారు.  

 

ఉన్నతాధికారుల అనుమతి గానీ, కనీసం స్టేషన్ రికార్డుల్లో మూవ్‌మెంట్ ఎంట్రీ గానీ లేకుండా పట్టణ పరిధి దాటి వెళ్లడం వివాదాస్పదంగా మారింది. సమీపంలోని కత్తెర్ల గ్రామం దగ్గర ఉన్న Mango Resort అనే  ఫామ్‌హౌస్‌కు వెళ్లిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో అధికారుల దృష్టికి రావడంతో ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ఉత్కంఠ డిపార్ట్మెంట్ లో కొనసాగుతోంది.