న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పంజాబ్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ పాల్గొనడం కొత్త చర్చకు దారి తీసింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ అమరీందర్ సింగ్ మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్లోకి రీ ఎంట్రీ ప్రచారంపై అమరీందర్ సింగ్ క్లారిటీ ఇచ్చారు. పార్టీలు వేరైనా గాంధీ కుటుంబంతో తనకు ఉన్న వ్యక్తిగత స్నేహం, సామాజిక మర్యాద కోసమే సోనియా గాంధీ పుస్తకావిష్కరణకు కార్కక్రమానికి హాజరయ్యానని వివరణ ఇచ్చారు.
ఇది కేవలం ఒక సామాజిక కార్యక్రమమని, ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని పేర్కొన్నారు. రాజకీయ అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ గాంధీ కుటుంబంతో తనకు దశాబ్దాల కాలంగా వ్యక్తిగత అనుబంధం ఉందని స్పష్టం చేశారు. గతంలో తాను రాసిన మూడు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమాలకు సోనియా గాంధీ స్వయంగా హాజరయ్యారని ఆయన గుర్తు చేశారు.
►ALSO READ | ఢిల్లీలో కుప్పకూలిన రెండంతస్థుల భవనం.. చిన్నారి సహా ఇద్దరు మృతి
2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రాబోతున్నారనే ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అలవాటు తనకు లేదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని తనను ఎవరూ అడగలేదని స్పష్టం చేశారు. బీజేపీలో అసంతృప్తగా ఉన్నారనే ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు.
సీఎం పదవికి, కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై
గాంధీ ఫ్యామిలీకి అత్యంత దగ్గరి వ్యక్తి అయినా పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ 2021లో ముఖ్యమంత్రి పదవితో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్టానం తనను పదే పదే అవమానించడంతో పాటు సీఎం పదవి నుంచి తొలగించేందుకు కుట్ర చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్కు రాజీనామా చేసిన వెంటనే అమరీందర్ సింగ్ 'పంజాబ్ లోక్ కాంగ్రెస్' పేరుతో సొంత పార్టీని స్థాపించారు. ఆ తర్వాత 2022, సెప్టెంబర్లో తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ప్రస్తుతం ఆయన బీజేపీలోనే కొనసాగుతున్నారు.
