సమస్తిపూర్: పూజ కోసం సిద్ధం చేసిన ప్రసాదం తిన్నదనే కోపంతో కన్నతల్లే నాలుగేళ్ల కూతురిని కొట్టి చంపింది. బిహార్ లోని సమస్తిపూర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. రాజ్ పాశ్వాన్, రీనా కుమారి దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇంట్లో ఛట్ పూజ ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో రీనా నైవేద్యం సిద్ధం చేసింది.
ఈ క్రమంలో చిన్నారి సుహాని కుమారి ప్రసాదంలోంచి ఓ పదార్థం తీసుకుని తినడంతో తల్లి ఆగ్రహానికి గురైంది. విచక్షణారహితంగా పాపను కొట్టింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
కూతురి మృతితో తండ్రి రాజ్ పాశ్వాన్ కన్నీరుమున్నీరయ్యారు. భార్యకు కఠిన శిక్ష పడాలని, ఇక ఆమెతో కలిసి ఉండబోనని చెప్పారు. మిగిలిన ఇద్దరు పిల్లలను తానే చూసుకుంటానని చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం సదర్ ఆసుపత్రికి తరలించారు. నిందితురాలైన రీనా కుమారిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
