హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కమిటీని రెండో విడతగా విస్తరించారు. జాతీయ అధ్యక్షురాలు అల్కా లంబా ఆమోదంతో, రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ సోమవారం మీడియా సమావేశంలో నూతన నియామకాలను ప్రకటించారు. ఈ విస్తరణలో భాగంగా ముగ్గురు ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులతో పాటు ఏడు జిల్లాలకు నూతన అధ్యక్షులను నియమించారు. తాజా నియామకాల ప్రకారం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బడిగే ఇందిరా, పిన్నింటి కావ్యారెడ్డి, నాయిని రజిత నియమితులయ్యారు.
ప్రధాన కార్యదర్శులుగా సిరిపురం లావణ్య, దాచేపల్లి సారిక, దుంగ్రోతు నాగమణి, ఇరుకుల్ల మంగకు అవకాశం కల్పించారు. అలాగే ఏడు జిల్లాలకు నూతన అధ్యక్షులను ప్రకటించారు. ఇందులో నిర్మల్ జిల్లాకు మేడారం అపర్ణ, జనగామకు వంగల కల్యాణి, ఆదిలాబాద్‌కు తుమ్మల అన్నపూర్ణ, కామారెడ్డికి ఆకుల కల్పన, ములుగుకు మద్దెల నాగమణి, వనపర్తికి శ్రీలత రెడ్డి, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సుప్రం అనిత నియమితులయ్యారు. రెండో విడత నియామకాలతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలోని 29 జిల్లాలకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షులను నియమించినట్లైందని ఎర్రబెల్లి స్వర్ణ తెలిపారు. మిగిలిన ఐదు జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుల నియామక ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేస్తామని ఆమె స్పష్టం చేశారు.
