గోవింద.. గోవింద..మార్మోగిన కురుమూర్తి కొండలు

గోవింద.. గోవింద..మార్మోగిన కురుమూర్తి కొండలు
  •     ఉద్దాల ఉత్సవానికి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు
  •     వైభవంగా పాదుకల ఊరేగింపు

చిన్నచింతకుంట, వెలుగు : మహబూబ్‌‌‌‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ సమీపంలోని కురుమూర్తి క్షేత్రం భక్తజన సందోహంతో కిక్కిరిసింది. సోమవారం జరిగిన స్వామివారి ఉద్దాల ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. గోవింద నామస్మరణతో కురుమూర్తి కొండలు మార్మోగాయి. ఆదివారం రాత్రి నుంచే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో భక్తులు భారీగా చేరుకున్నారు. స్వామివారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి, మట్టి కుండల్లో నైవేద్యాలు తయారుచేసి మొక్కులు చెల్లించుకున్నారు. 

స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. పల్లమరి గ్రామం నుంచి స్వామివారి పాదుకలను ప్రత్యేక పూజల అనంతరం వడ్డెమాన్‌‌‌‌కు తీసుకువచ్చారు. అక్కడ హరిజనులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాదుకలను దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం అప్పంపల్లి, తిరుమలాపురం మీదుగా ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చిన స్వామివారి ఉద్దాలు సాయంత్రం 7 గంటలకు జాతర ప్రాంగణానికి చేరుకున్నాయి. భక్తులు గోవింద నామస్మరణతో స్వాగతం పలికారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేయగా, 600 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. ఆలయ చైర్మన్ బత్తుల బాలరాజ్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉద్దాలను మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి దర్శించుకున్నారు.