- ఆయా నియోజకవర్గాల్లో నూతన పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత
మెదక్/ జోగిపేట/ పుల్కల్/ వెంకటాపూర్/ పెగడపల్లి/ మక్తల్/ ఎల్కతుర్తి, , వెలుగు: నిరుపేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రులు దామోదర్ రాజనర్సింహ, దనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిర్వహించిన నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొని లబ్ధిదారులకు ఉత్తర్వులు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4.50 లక్షల చేయూత పింఛన్లు మంజూరు చేసినట్లు మంత్రులు తెలిపారు.
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ఇతర అర్హులకు పింఛన్ల ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో మంత్రి దామోదర్, ములుగు నియోజకవర్గ పరిధిలోని ములుగు, వెంకటాపూర్ మండలాలు, మున్సిపాలిటీలో మంత్రి సీతక్క లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలు అందజేశారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క నూతన పింఛన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఎల్కతుర్తిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ హనుమకొండ జిల్లా విద్యార్థుల కోసం దాదాపు 100 ఎకరాల్లో నిట్ ఎక్స్టెన్షన్ క్యాంపస్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, కోర్టు, బస్టాండ్, 132 కేవీ సబ్ స్టేషన్, 30 పడకల ఆసుపత్రి అభివృద్ధి పనులు త్వరలో చేపడతామన్నారు. పీవీ నాలెడ్జ్ సెంటర్ ను ఈ డిసెంబర్ లోపు పూర్తి చేస్తామన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో 605 మందికి కొత్త పింఛన్లు పంపిణీ చేయడంతో పాటు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద 8 మందికి రూ.9.28 లక్షలు, 125 మందికి సీఎంఆర్ఎఫ్కింద మంజూరైన రూ.42.38 లక్షల చెక్కులు మంత్రి అడ్లూరి అందించారు. మక్తల్ నియోజకవర్గంలో 4,085 మందికి కొత్త పింఛన్లు మంజూరు చేసినట్లు మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. పింఛన్లతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, రైతు రుణమాఫీ వంటి పథకాలతో పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రులు వివరించారు.
మహిళా సంఘాలకు రుణాలు అందిస్తూ స్వయం ఉపాధి అవకాశాలను ప్రోత్సహిస్తున్నామని, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యమని తెలిపారు. కుటుంబ పెద్దను కోల్పోయిన వారికి భరోసా కల్పించేందుకు రూ.5 లక్షల జీవిత బీమా అందించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా అమలు చేయనున్నట్లు మంత్రి సీతక్క పేర్కొన్నారు. యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, క్రీడారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రులు తెలిపారు. మక్తల్లో రూ.25 కోట్లతో ఆధునిక స్టేడియం నిర్మించనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. మినిస్టర్ కప్ క్రికెట్ పోటీలను ప్రారంభించి క్రీడాకారులను ప్రోత్సహించారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
