ప్రపంచ వేదికపైకి మన గిరిజన బిడ్డ..విదేశీ ప్రయాణానికి దాతల సాయం కోసం ఎదురుచూపులు

ప్రపంచ వేదికపైకి మన గిరిజన బిడ్డ..విదేశీ ప్రయాణానికి దాతల సాయం కోసం ఎదురుచూపులు

హుస్నాబాద్, వెలుగు: కాళ్లకు బూట్లు లేకున్నా ఆటపై మక్కువ తగ్గలేదు. కనీస సౌకర్యాలు లేకపోయినా కంకర రాళ్లతో నిండిన మైదానంలో ఒట్టి కాళ్లతోనే సాధన చేసింది. ఎన్నో కష్టాలను అధిగమించి అంతర్జాతీయ క్రీడా వేదికపై దేశం తరఫున ఆడే అవకాశం దక్కించుకుంది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం హథీరామ్ అంబానాయక్ తండాకు చెందిన బానోతు శైలజ మెక్సికోలో జరగనున్న ఇంటర్నేషనల్ సాకర్ ట్రోఫీ (హోమ్‌‌‌‌లెస్ వరల్డ్ కప్)కు భారత జట్టు తరఫున ఎంపికైంది. తెలంగాణ నుంచి ఎంపికైన ఏకైక మహిళా క్రీడాకారిణిగా నిలిచింది. 

నిరుపేద కుటుంబానికి చెందిన శైలజ చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకుంది. గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు, కోచ్‌‌‌‌ల ప్రోత్సాహంతో అథ్లెటిక్స్​లోనూ రాణించి పలు బంగారు పతకాలు సాధించింది. అయితే ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌పై ఉన్న ఆసక్తితో షూస్ కూడా లేకుండానే సాధన కొనసాగించింది. 2019లో రాష్ట్రస్థాయి ఫుట్‌‌‌‌బాల్ టోర్నీలో బంగారు పతకం సాధించింది. జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించింది. మెదక్ స్టేట్ మీట్‌‌‌‌లో 17 గోల్స్ సాధించింది. 2022లో జమ్మూకాశ్మీర్‌‌‌‌లో జరిగిన పోటీల్లో కాలు విరిగి నాలుగు నెలలు ఆటకు దూరమైనా పట్టుదలతో తిరిగి మైదానంలోకి వచ్చింది. సీఎం కప్‌‌‌‌లో 18 గోల్స్ సాధించి తన ప్రతిభను చాటుకుంది. 

2025లో ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లో జరిగిన జాతీయస్థాయి ఫుట్‌‌‌‌బాల్ ఛాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో అత్యుత్తమ ప్రదర్శనతో సెలెక్టర్లను ఆకట్టుకుంది. దీంతో 2027 జనవరి 17 నుంచి 23 వరకు మెక్సికోలో జరిగే ఇంటర్నేషనల్ సాకర్ ట్రోఫీకి ఎంపికైంది. అయితే విదేశీ ప్రయాణం, ఇతర ఖర్చులకు అవసరమైన ఆర్థిక స్థోమత శైలజ కుటుంబానికి లేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రభుత్వం తరఫున రూ.లక్ష సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ మరింత ఆర్థిక సహాయం అవసరమని శైలజ కోరుతోంది. దాతలు, స్వచ్ఛంద సంస్థలు, స్పాన్సర్లు ముందుకొచ్చి సహకరించాలని విజ్ఞప్తి చేస్తోంది. తగిన ప్రోత్సాహం లభిస్తే అంతర్జాతీయ వేదికపై దేశానికి పతకం సాధించి పెడతానని ధీమా వ్యక్తం చేస్తోంది. మారుమూల తండా నుంచి ప్రపంచ వేదికకు చేరిన శైలజకు చేయూత అందిస్తే ఆమె కల సాకారమయ్యే అవకాశం ఉంది.