న్యూఢిల్లీ: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియపై భారత ఎన్నికల సంఘా(ఈసీఐ)న్ని అధికారికంగా ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రతిపక్ష 'ఇండియా బ్లాక్' నేతలు సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు మరో 10 మంది ప్రతిపక్ష నేతలు సుప్రీంకోర్టులో ఈ మేరకు మధ్యంతర పిటిషన్ (అప్లికేషన్) దాఖలు చేశారు. మొత్తం 48 ఇంటరాగేటరీస్(ప్రశ్నలు)లకు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్, మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి, అలాగే.. ఈసీఐ ఐటీ డైరెక్టర్ జనరల్, డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ భాను ప్రకాష్ నుంచి వివరణ కోరేందుకు అనుమతించాలని పిటిషన్ ద్వారా కోరారు.
దేశవ్యాప్తంగా చేపట్టిన సర్ ప్రక్రియలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని..కేంద్ర ప్రభుత్వం 'ఓట్ల చోరీ'కి పాల్పడిందని ఆరోపించారు. సుప్రీంకోర్టులో అక్టోబర్ 26న, ఈ నెల14న ఈసీ దాఖలు చేసిన కౌంటర్, అనుబంధ అఫిడవిట్లలో తాము లేవనెత్తిన కీలక ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు. కేవలం నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగా తీసుకున్నామని ఈసీ పేర్కొనడమే తప్ప, అందుకు సంబంధించిన ఫైల్ నోటింగ్స్, తేదీలు, రికార్డులను బయటపెట్టలేదని తమ పిటిషన్లో ప్రతిపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
సర్ ప్రక్రియపై ఇప్పటికైనా చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు, ఈసీఐ ఐటీ డైరెక్టర్ జనరల్ వ్యక్తిగతంగా అఫిడవిట్ల రూపంలో సమాధానాలు ఇవ్వాలని పిటిషన్లో స్పష్టంగా కోరారు. ప్రతిపక్ష కూటమి సుప్రీంకోర్టుకు సమర్పించిన 48 ప్రశ్నల జాబితాలోని ముఖ్యాంశాలను కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.
సర్ నిర్ణయం ఎవరిది..?
దేశవ్యాప్తంగా సర్ నిర్వహించాలని ఎవరు ఆదేశాలు జారీ చేశారు..? ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు కమిషనర్ల అభిప్రాయాలు ఏమిటి..? అనే విషయాలను వెల్లడించాలని ప్రతిపక్షాలు తమ పిటిషన్ ద్వారా డిమాండ్ చేస్తున్నాయి. కీలకమైన నిర్ణయాలకు ఏకగ్రీవ ఆమోదం లభించిందని ఎన్నికల సంఘం చెబుతున్నప్పటికీ.. రికార్డులు, తేదీలు, ఫైల్ నంబర్లను ఎందుకు బయట పెట్టడం లేదని నిలదీశాయి.
ఆన్లైన్ ఫామ్ 6 దరఖాస్తులు, అదనపు డిక్లరేషన్లు, ఫామ్ 7 అభ్యంతరాలు, పశ్చిమ బెంగాల్లో జరిగిన పరిణామాలపై మొత్తం 48 ప్రశ్నలతో కూడిన సుదీర్ఘ జాబితాను సుప్రీంకోర్టు ముందుంచాయి. ప్రీ- సర్, డ్రాఫ్ట్, తుది ఓటర్ల జాబిత, తొలగించిన ఓటర్ల వివరాలను రాష్ట్రాల వారీగా, లింగం వారీగా బయటపెట్టాలని కోరారు. వాట్సాప్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా కమిషనర్లు తీసుకున్న ఆమోదాల వివరాలను కూడా భద్రపరచాలని పిటిషన్లో ప్రస్తావించారు. ఈ సంచలన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారమే విచారణ జరపనుంది.
