న్యూఢిల్లీ: ఏఐ, చిప్ డ్రోన్లు, శాటిలైట్ ఇంటెలిజెన్స్‌తో మోడ్రన్ వార్ఫేర్ పూర్తిగా మారిపోయిందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి తెలిపారు. ఇప్పుడు వార్ఫీల్డ్ అంటే సరిహద్దు ప్రాంతం మాత్రమే కాదని, యావత్తు దేశమే టార్గెట్ అవుతుందని చెప్పారు. అందుకే నేటి యుద్ధాల్లో ‘ఎవరూ సేఫ్ కాదు’ అని హెచ్చరించారు. సోమవారం ఢిల్లీలో జరిగిన నేషనల్ సెక్యూరిటీ సమిట్ 3.0లో ‘భారత సాయుధ దళాలు, భవిష్యత్తు యుద్ధాలకు సన్నద్ధత’ అనే స్పెషల్ సెషన్లో ఆయన ప్రసంగించారు.
భవిష్యత్తు యుద్ధాల స్వభావాన్ని నిర్ణయించే మూడు అంశాలను రాజా సుబ్రమణి వివరించారు. వార్ ఎకనామిక్స్‌లో వస్తున్న మార్పులు, ఆధునిక టెక్నాలజీ ఆధిపత్యం కోసం జరిగే పోటీ, వార్ఫీల్డ్ విస్తరణ ఇందులో ప్రధానమని చెప్పారు. కేవలం 2,500 డాలర్ల విలువైన చిన్న డ్రోన్‌ను కూల్చేందుకు 25 లక్షల డాలర్ల మిసైల్‌ను వాడితే ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు. అందుకే తక్కువ ఖర్చుతో ఆయుధాలను భారీగా ఉత్పత్తి చేసే సామర్థ్యం దేశానికి ఎంతో అవసరమన్నారు.
సుదీర్ఘ పోరాటాలకు రెడీగా ఉండాలి
ఏఐ, డేటా, క్రిటికల్ మినరల్స్‌పై నియంత్రణ లేని ఏ దేశమైనా ఆర్థికంగా, సైనికంగా బలహీనపడుతుందని సీడీఎస్ రాజా సుబ్రమణి హెచ్చరించారు. ప్రస్తుతం ఈ ఆధిపత్య పోటీ అమెరికా, చైనా దేశాల మధ్య స్పష్టంగా కనిపిస్తోందన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, అలాగే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఘర్షణల నుంచి నేర్చుకున్న పాఠాలను సభలో ప్రస్తావించారు. ఏ దేశమూ యుద్ధం త్వరగా ముగుస్తుందని భావించకూడదని, సుదీర్ఘ పోరాటానికి సిద్ధంగా ఉండాలంటే రక్షణ రంగంలో ఆత్మనిర్భరత చాలా అవసరమని వివరించారు.
సిబ్బందిని టార్గెట్ చేస్తున్నరు: అశుతోష్ దీక్షిత్
రక్షణ రంగ సమాచారాన్ని దొంగిలించడానికి శత్రు దేశాలు కేవలం హనీట్రాప్లనే కాకుండా సైబర్ దాడులు, ఆర్థిక ప్రలోభాలనూ ఆయుధంగా వాడుతున్నాయని వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ పరిశోధనా సంస్థలు, ప్రైవేట్ రక్షణ రంగ కాంట్రాక్టు సిబ్బందిని శత్రు దేశాలు టార్గెట్ చేసుకుంటున్నాయని చెప్పారు. మల్టీ-లెవల్ మార్కెటింగ్(ఎంఎల్ఎం) స్కీమ్‌లు, అధిక వడ్డీలకు అప్పులిచ్చే ముఠాల ద్వారా సిబ్బందిని ఆర్థిక ఊబిలోకి దించి రహస్యాలు రాబట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
భారత సైనిక కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు బయటి ఇంటర్నెట్తో సంబంధం లేకుండా సురక్షితంగా ఉంటాయని దీక్షిత్ వివరించారు. నేరుగా హ్యాక్ చేయడం సాధ్యం కాకపోవడంతో లోపల పనిచేసే మనుషుల బలహీనతలను ఆసరాగా చేసుకుని అంతర్గత ముప్పు సృష్టించేందుకు శత్రువులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వీటిని అరికట్టడానికి ఇప్పటికే పటిష్టమైన సాంకేతిక, సంస్థాగత రక్షణ వ్యవస్థలు అమలులో ఉన్నాయని వెల్లడించారు.
అలాగే, రక్షణ రంగానికి పనిచేసే ప్రైవేట్ సంస్థలు కూడా సురక్షితమైన సాఫ్ట్‌వేర్‌ను వాడాలని సూచించారు. మరోవైపు, దేశీయంగా తయారు చేసిన అత్యంత ఆధునిక యుద్ధ విమానం 'తేజస్ మార్క్ 1ఏ' పూర్తి స్థాయి స్క్వాడ్రన్‌ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోకి ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఇది 4.5 తరం యుద్ధ విమానానికి అత్యంత అధునాతన వెర్షన్ అని తెలిపారు. అప్‌గ్రేడ్ చేసిన ఎల్సీఏ మార్క్ 2 విమానం వచ్చే ఏడాది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.
