భీమదేవరపల్లి, వెలుగు: ప్రజావాణికి వచ్చే ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా రికార్డు చేయాలని, సమస్య పరిష్కారమయ్యే వరకు పర్యవేక్షించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల పరిషత్ ఆఫీస్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని మంత్రి ఆకస్మికంగా పరిశీలించారు. ప్రజల నుంచి వస్తున్న వినతులు, సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చే ప్రతి దరఖాస్తును నమోదు చేసి, పరిష్కారానికి అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
ప్రజావాణి సమయంలో సంబంధిత ఆఫీసర్లంతా తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, ప్రతి సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు విధుల్లో ఉండాలని స్పష్టం చేశారు. గైర్హాజరైన అధికారులకు ఫోన్ చేసి కారణాలు తెలుసుకున్నారు. అనంతరం ముల్కనూరు పీహెచ్సీ పరిధిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు తక్షణ చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వో అప్పయ్యను ఫోన్లో ఆదేశించారు. అనంతరం సాయినగర్ లో నూతనంగా నిర్మించిన పోచమ్మ ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పాలకవర్గం మంత్రిని ఘనంగా సన్మానించింది.
