- పట్టా, పొజిషన్ సర్టిఫికెట్లవాపస్కు ఆదేశాలు
- 7 లక్షల మందికి ప్రయోజనం
- మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ సహా వివిధ ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల కింద ఇళ్లు నిర్మించుకున్న పేదలకు గతంలో జారీ చేసిన పట్టాలను తిరిగి అందించాలని నిర్ణయించినట్లు హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సీఎం సూచనల మేరకు పేదల సొంతింటిపై హక్కును మరింత భద్రం చేసేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీనివల్ల 7 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు.
గతంలో అమలు చేసిన విధానం ప్రకారం ప్రభుత్వం వద్ద ఉన్న లబ్ధిదారుల ఇంటి పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లను తిరిగి అందించేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. దాదాపు దశాబ్దానికి పైగా ఇంటి పట్టా సర్టిఫికెట్లు తిరిగి రాకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి, తనకు పెద్ద ఎత్తున వినతులు వచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 22ఏపై సమీక్షలు జరుగుతున్న సమయంలో ఈ పట్టాలు తహసీల్దార్ ఆఫీసుల్లో పేరుకుపోయిన విషయం సీఎం దృష్టికి వచ్చిందన్నారు.
వెంటనే వాటిని పేదలకు తిరిగి ఇవ్వాలని ఆదేశించారని తెలిపారు. 2014 కంటే ముందు అమలు చేసిన పథకంలో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ సబ్సిడీతోపాటు లబ్ధిదారుల వాటా, బ్యాంకు రుణం ద్వారా ఆర్థిక సాయం అందించేవారని మంత్రి గుర్తు చేశారు. రుణాల కోసం లబ్ధిదారుల ఇంటి పట్టాలను ష్యూరిటీగా ఉంచుకునేవారని, రుణ వాయిదాలన్నీ చెల్లించిన వారికి వాటిని తిరిగి ఇచ్చేవారని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇందిరమ్మ పథకాన్ని నిలిపివేయడంతో కొందరికి తనఖాలో ఉన్న పట్టాలు తిరిగి అందలేదన్నారు. ఈ నేపథ్యంలో వాటిని లబ్ధిదారులకు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు పొంగులేటి తెలిపారు.
