- జలవిద్యుత్ తగ్గినాసమర్థవంతంగా నిర్వహణ
- అధికారుల సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, రానున్న రబీ సీజన్లో వ్యవసాయం సహా అన్ని రంగాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా సరఫరాలో ఎక్కడా అంతరాయం కలగకూడదని స్పష్టం చేశారు. సోమవారం ప్రజాభవన్ లో ఇంధన శాఖ ఉన్నతాధికారులు, టీజీ ఎస్పీడీసీఎల్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
వర్షాలు తక్కువగా కురవడంతో జలవిద్యుత్ ఉత్పత్తిలో సుమారు 4 వేల మెగావాట్ల కొరత ఏర్పడినప్పటికీ, ఖరీఫ్ సీజన్లో విద్యుత్ సంస్థలు సమర్థంగా పనిచేశాయన్నారు. అక్టోబర్ 16న రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గరిష్ఠ స్థాయిలో 20,018 మెగావాట్లకు చేరినా, మరుసటి రోజు 20,003 మెగావాట్లు నమోదైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేశామని గుర్తుచేశారు. గతేడాది నవంబర్ 16న 8,522 మెగావాట్లుగా ఉన్న గరిష్ఠ డిమాండ్, ఈ ఏడాది అదే రోజుకు 12,802 మెగావాట్లకు పెరిగిందని వివరించారు.
రబీ సీజన్లో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉన్నందున విద్యుత్ డిమాండ్ ఆకస్మికంగా పెరగవచ్చని, అందుకు అనుగుణంగా విద్యుత్ సమకూర్చుకోవాలని ఆదేశించారు. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నామని, ఇందులో భాగంగా సరూర్నగర్ సర్కిల్ పరిధిలో కొత్తగా రెండు 33/11 కేవీ సబ్ స్టేషన్లను అందుబాటులోకి తెచ్చామని అధికారులు వివరించారు.
