రాష్ట్రంలో 1,651 కంపల్సరీ గవర్నమెంట్ సర్వీస్ సీట్లు.. మ్యాట్రిక్స్ విడుదల చేసిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్

రాష్ట్రంలో 1,651 కంపల్సరీ గవర్నమెంట్ సర్వీస్ సీట్లు..  మ్యాట్రిక్స్ విడుదల చేసిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్

• 45 ఇనిస్టిట్యూషన్లు, 25 విభాగాల్లో పోస్టుల కేటాయింపు
• ఉస్మానియాలో అత్యధికంగా 108, కాకతీయలో 73, గాంధీలో 66 సీట్లు
• ఓబీజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, అనస్థీషియాలోనే అధిక భాగం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ ఇనిస్టిట్యూషన్లలో కంపల్సరీ గవర్నమెంట్ సర్వీస్ (సీజీఎస్) 2026 సీట్ మ్యాట్రిక్స్ ను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) విడుదల చేసింది. మొత్తం 45 కేంద్రాల్లోని 25 విభాగాల్లో 1,651 సీట్లను కేటాయించగా.. ఉస్మానియా మెడికల్ కాలేజీకి అత్యధికంగా 108, కాకతీయ మెడికల్ కాలేజీకి 73, గాంధీ మెడికల్ కాలేజీకి 66 సీట్లు దక్కాయి. టిమ్స్/జీఎంసీ సూర్యాపేటకు 58, రిమ్స్ ఆదిలాబాద్ కు 44, నిమ్స్/జీఎంసీ నాగర్ కర్నూల్ కు సైకియాట్రీలో 2 సీట్లు ఇచ్చారు. విభాగాల వారీగా ఓబీజీ (178), జనరల్ మెడిసిన్ (174), జనరల్ సర్జరీ (166), అనస్థీషియా (158), పీడియాట్రిక్స్ (131)లో అత్యధిక పోస్టులు ఉన్నాయి.

 ఆర్థోపెడిక్స్ (93), రేడియోడయాగ్నసిస్ (91), ఆప్తల్మాలజీ (90), పాథాలజీ (80), ఈఎన్ టీ (64), డీవీఎల్ (63), టీబీ అండ్ సీడీ (53), సైకియాట్రీ (47)తో పాటు ఫార్మకాలజీ (44), మైక్రోబయాలజీ (43), బయోకెమిస్ట్రీ (33), ఫిజియాలజీ (28), ఫోరెన్సిక్ మెడిసిన్ (27), అనాటమీ (24), ఎస్ పీఎం (23) విభాగాల్లో మిగిలిన సీట్లను కేటాయించారు. కాగా, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పీజీ (ఎండీ/ఎంఎస్/డిప్లొమా) పూర్తి చేసిన డాక్టర్లు రూల్స్ ప్రకారం.. కనీసం ఏడాది పాటు రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్స్ లో తప్పనిసరిగా సేవలు అందించాలి. ప్రభుత్వ హాస్పిటల్స్ లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరతను తీర్చేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. 

మెడికల్ కాలేజీల్లోనే 1,107 సీట్లు

రాష్ట్రంలోని 31 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు మొత్తం 1,107 సీట్లు దక్కాయి. వీటిలో సిద్దిపేట (49), నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి (46), మహబూబ్ నగర్ (45), కొమురంభీం ఆసిఫాబాద్, గద్వాల, నారాయణ్ పేట (44) కాలేజీల్లో ఎక్కువ సీట్లు ఉండగా, యాదాద్రి (22), కుత్బుల్లాపూర్, మహేశ్వరం (23), జనగాం, నర్సంపేట (26) కాలేజీల్లో తక్కువ సీట్లు ఉన్నాయి. 8 జీఎంసీ పాలిక్లినిక్ లలో 8 ప్రధాన క్లినికల్ విభాగాల్లోనే మొత్తం 193 సీట్లు కేటాయించారు. 

ఇందులో రామగుండం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ కు 31 చొప్పున, నల్గొండ, మంచిర్యాల, జగిత్యాలకు 23 చొప్పున, సంగారెడ్డికి 16, రాజన్న సిరిసిల్లకు 15 సీట్లు వచ్చాయి. ఎమర్జెన్సీ మెడిసిన్ (15), రేడియేషన్ ఆంకాలజీ (14), పీఎంఆర్ (5), ట్రాన్స్ ఫ్యూజన్ మెడిసిన్ (5), హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ (2) వంటి ప్రత్యేక విభాగాల సీట్లు ఉస్మానియా, గాంధీ, కాకతీయ, టిమ్స్/జీఎంసీ సూర్యాపేట, జీఎంసీ రామగుండం హాస్పిటల్స్ కు మాత్రమే పరిమితమయ్యాయి.