కత్తి కాంతారావు జయంతి సందర్భంగా తెలుగు ఫిల్మ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం, భారత్ కల్చరల్ అకాడమీ గత 24 ఏళ్లుగా 'కత్తి కాంతారావు జాతీయ పురస్కారం’ను అందజేస్తున్నాయి. సోమవారం ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ ఏడాది ఆ పురస్కారాన్ని ప్రముఖ నటుడు సుమన్ అందుకున్నారు. అవార్డు కమిటీ ఛైర్మన్ కె.వి. రమణాచారి (ఐఏఎస్), కో-ఛైర్మన్లు సి. పార్థసారథి ఐఏఎస్ (రిటైర్డ్), నాగబాల డి. సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
కర్మ సిద్ధాంతాన్ని నమ్మి, మన పని మనం నిజాయితీగా చేయాలని నమ్ముతూ గత 48 ఏళ్లుగా దాదాపు వెయ్యి సినిమాల్లో నటించిన తనకు కాంతారావు గారి జాతీయ అవార్డ్ రావడం సంతోషంగా ఉందని సుమన్ అన్నారు. నటీనటులు బాబుమోహన్, కవిత, పొలిటీషియన్ వేణుగోపాలాచారి, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
