మనీలా: ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంతో పాటు, ప్రాంతీయ, ప్రపంచ సవాళ్లపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఫిలిప్పీన్స్కు చేరుకున్నారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్.మార్కోస్ జూనియర్ ఆహ్వానం మేరకు ప్రధాని ఈ పర్యటన చేపట్టారు. మంగళవారం జరగనున్న 23వ ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సు, 21వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొంటారు.
మనీలా బయలుదేరే ముందు ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత్ మహాసాగర్ దృక్పథంలో ఆసియాన్ దేశాలతో సంబంధాలు అత్యంత కీలకమైనవని పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సహకారాన్ని పెంపొందించే దిశగా నేతలతో చర్చిస్తానని చెప్పారు. ఫిలిప్పీన్స్లో నివసిస్తున్న ప్రవాస భారతీయ కమ్యూనిటీతో ప్రధాని సమావేశం కానున్నారు. ఫిలిప్పీన్స్ చేరుకున్న ప్రధాని మోదీ సోమవారం రాత్రి ఆ దేశ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్.మార్కోస్ జూనియర్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో పాల్గొన్నారు.
