డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తోన్న బస్సు వంతెన మీదినుంచి ప్రమాదవశాత్తూ వాగులో పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. మంగళవారం (నవంబర్ 17) ఉదయం తెహ్రీ గర్వాల్ జిల్లాలో రిషికేశ్-బద్రీనాథ్ జాతీయ రహదారిపై గులార్ మార్కెట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.
రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) కూడా బృందాలు సహయక చర్యల్లో పాల్గొన్నాయి. గాయపడిన ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తు్న్నారు. బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
తెహ్రీ గర్వాల్ జిల్లా మేజిస్ట్రేట్ ప్రకారం.. మంగళవారం (నవంబర్ 17) ఉదయం రిషికేశ్-బద్రీనాథ్ జాతీయ రహదారిపై గులార్ మార్కెట్ సమీపంలో ఒక వంతెన పై నుంచి 30-35 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు దాదాపు 100 మీటర్ల లోతున ఉన్న వాగులోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం ఎనిమిది మంది మృతి చెందగా.. సుమారు 20 మంది గాయపడ్డారు.
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే బయాసి, ధల్వాలాలోని రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టాయి. గాయపడిన ప్రయాణికులను రక్షించి అంబులెన్స్‌లో ఆసుపత్రులకు తరలించారు. ఘటన స్థలంలో సహయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
