న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లో టెర్రరిస్టుల ఏరివేత కొనసాగుతోంది. కుల్గామ్ జిల్లాలో సోమవారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మరో టెర్రరిస్ట్ కోసం సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో హతమైన వ్యక్తి లష్కర్-ఎ-తైబా టెర్రరిస్ట్ లతీఫ్ భట్ అని వార్తలు వస్తున్నా.. దీనిపై అధికారిక నిర్ధారణ లేదని డీజీపీ నళిన్ ప్రభాత్ స్పష్టం చేశారు.
గత బుధవారం (నవంబర్ 11) కుల్గామ్‌లోని మీర్ బజార్ సమీపంలో సీఆర్‌పీఎఫ్ పోస్టుపై ఇద్దరు టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా మారింది. దాడి తర్వాత టెర్రరిస్టులు అటవీలోకి పారిపోయారు. ఈ ఘటనలో లతీఫ్ భట్ కీలక నిందితుడిగా ఉన్నట్లు భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.
ఈ ఏడాది జులై 22న అనంతనాగ్‌లో పోలీస్ కానిస్టేబుల్ హత్య, జులై 31న కుల్గామ్‌లో వలస కార్మికుల హత్య ఘటనల్లోనూ అతడి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. కుల్గామ్ దాడి జరిగిన 24 గంటల్లోపే కిష్త్వార్ జిల్లాలో ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు బాబీ చంద్, యశ్ పాల్ కుమార్‌లను టెర్రరిస్టులు హతమార్చారు. మరోవైపు ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్నవారు వాస్తవాలను గుర్తించడం లేదని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు.
