కేంద్ర హోంమంత్రి అమిత్ షా భావోద్వేగ వ్యాఖ్యలు
పుణె: మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్‌సీపీ నాయకుడు అజిత్ పవార్ ఆకస్మిక మృతి రాష్ట్రానికి తీరని లోటని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. పుణెలో అజిత్ పవార్ కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సోమవారం పుణె జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంతో పాటు ఆ కార్యాలయ గేటుకు అజిత్ పవార్ పేరును నామకరణం చేశారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. కోవిడ్ సమయంలో అప్పటి సీఎం ఉద్ధవ్ థాక్రే కంటే అజిత్ పవార్ పరిపాలనా దక్షత, క్రమశిక్షణ ఎంతో మెరుగ్గా ఉండేవని కొనియాడారు. "దేవేంద్ర ఫడ్నవీస్ నుంచి ఉదయం 8:30 గంటలకు నాకు ఫోన్ వచ్చినప్పుడు అజిత్ పవార్ మృతి చెందిన వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అజిత్ మృతి మహారాష్ట్రకు ఎప్పటికీ పూడ్చలేని తీరని నష్టం. రాబోయే 40 ఏండ్లపాటు ఆ శూన్యతను ఎవరూ భర్తీ చేయలేరు" అని షా ఆవేదన వ్యక్తం చేశారు.
