మనిషి కాదు మహా శత్రువు.. ఏలియన్‌తో అక్షయ్ కుమార్ భీకర పోరాటం!

మనిషి కాదు మహా శత్రువు.. ఏలియన్‌తో అక్షయ్ కుమార్ భీకర పోరాటం!

యాక్షన్, కామెడీ జానర్స్‌‌లో వైవిధ్యభరితమైన కథాంశాలతో ఆకట్టుకునే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, ఈసారి సైన్స్ ఫిక్షన్ జానర్‌‌లో అడుగుపెట్టారు. ఏలియన్ నేపథ్యంలో సాగే ఈ భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌కు కనిష్క్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.  సన్‌‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌‌పై విపుల్ అమృత్‌‌లాల్ షా నిర్మిస్తున్నారు. దాదాపు పదమూడేళ్ల తర్వాత అక్షయ్, విపుల్ షా కలిసి వర్క్ చేస్తున్న సినిమా ఇది.  సోమవారం ఈ మూవీ మోషన్ పోస్టర్‌‌‌‌ను విడుదల చేయడంతో పాటు సినిమా విడుదల తేదీని ప్రకటించారు. 

‘‘శత్రువు మనిషి కాదు.. కానీ ఈ పోరాటం మానవాళి కోసం.. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు..  వచ్చే ఏడాది మే 28న దండయాత్ర మొదలవుతుంది” అంటూ రిలీజ్‌‌ డేట్‌‌ను రివీల్ చేశారు.  ఇక పోస్టర్‌‌‌‌లో దట్టమైన పొగమంచుతో ఉన్న అడవిలో చేతిలో తుపాకి పట్టుకుని తెలియని ముప్పును ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నట్టుగా అక్షయ్ కనిపించారు. ఆ తర్వాత భయంకరమైన రూపంతో ఏలియన్‌‌ను ప్రజెంట్ చేసిన తీరు సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.  రుక్మిణి మైత్రా, వినీత్ కుమార్ సింగ్, రజత్ కపూర్, బనితా సంధు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలు, అబ్బురపరిచే వీఎఫ్ఎక్స్ హంగులతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.