పోలీస్ బ్యాండ్‌‌కు పూర్వ వైభవం తెస్తాం..బ్యాండ్‌‌ను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తాం: డీజీపీ సీవీ ఆనంద్

పోలీస్ బ్యాండ్‌‌కు పూర్వ వైభవం తెస్తాం..బ్యాండ్‌‌ను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తాం: డీజీపీ సీవీ ఆనంద్
  • హైదరాబాద్‌‌లో 27వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలు ప్రారంభం
  • 25కిపైగా బ్యాండ్లతో1,500 మంది ప్రదర్శనలు 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో ప్రాభవం కోల్పోయిన పోలీస్ బ్రాస్ బ్యాండ్‌‌కు మళ్లీ పాత రోజులు తీసుకొస్తామని, పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. పోలీస్ బ్యాండ్లు కేవలం సంగీత బృందాలు మాత్రమే కాదని, క్రమశిక్షణ, గుర్తింపు, గౌరవం, సమష్టి స్ఫూర్తికి ప్రతీకలని చెప్పారు. దేశవ్యాప్తంగా పోలీస్, కేంద్ర సాయుధ బలగాల సంగీత ప్రతిభను చాటిచెప్పే 27వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలను సోమవారం ఆయన ప్రారంభించారు.

రంగారెడ్డి జిల్లా సీఆర్‌‌పీఎఫ్ గ్రూప్ సెంటర్‌‌లో ఈ నెల 20 వరకు ఐదు రోజుల పాటు పోటీలు జరగనున్నాయి. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన డీజీపీ మాట్లాడుతూ జాతీయ వేడుకలు, కవాతులు, గౌరవ వందనాలు, పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో బ్యాండ్ల పాత్ర కీలకమని చెప్పారు. ఇలాంటి పోటీలు పోలీసు బలగాల మధ్య స్నేహభావం, ఆరోగ్యకరమైన పోటీతత్వం, జాతీయ సమైక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

శిల్పారామం, లుంబినీ పార్కులో ప్రదర్శనలు.. 

పోటీల్లో భాగంగా మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు హైటెక్స్ సిటీలోని శిల్పారామంలో సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ సమక్షంలో బ్యాండ్ ప్రదర్శన నిర్వహించనున్నారు. బుధవారం సాయంత్రం 5.30 గంటలకు లుంబినీ పార్కులో సంగీత దర్శకుడు తమన్ సమక్షంలో మరో ప్రదర్శన ఏర్పాటు చేశారు. అఖిల భారత పోలీస్ క్రీడల నియంత్రణ మండలి ఆధ్వర్యంలో సీఆర్‌‌పీఎఫ్ ఈ పోటీలను నిర్వహిస్తోంది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలకు చెందిన 25కిపైగా బ్యాండ్ బృందాలు పాల్గొంటున్నాయి. దాదాపు 1,500 మంది బ్యాండ్ సిబ్బంది తమ సంగీత ప్రతిభను ప్రదర్శించనున్నారు.