ఇంటర్ విద్య రద్దుతో డ్రాపౌట్లు తగ్గేనా..?

ఇంటర్ విద్య రద్దుతో డ్రాపౌట్లు తగ్గేనా..?

ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డ్రాపౌట్లు తగ్గించే లక్ష్యంతో పాఠశాల విద్యలో ఇంటర్ విద్యను విలీనం చేయనున్నారు. అయితే, ఇంటర్ తరగతులైన 11, 12 క్లాసులను  ప్రస్తుతం ఉన్న పాఠశాలలోనే ప్రారంభించే అవకాశం ఉండవచ్చు. రాష్ట్రంలో 4000 పైగా ఉన్నత పాఠశాలలు, 417 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అయితే మొత్తం స్కూళ్లలో 10+2 విద్య సాధ్యం కాదు. ఎందుకంటే ప్రభుత్వ కళాశాలల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య 1.25 లక్షలు. దాదాపు 4 లక్షల మందికి పైగా ప్రైవేట్ కాలేజీల్లో చేరుతున్నారు.  

మన ఉన్నత పాఠశాలల్లో ఇంటర్ తరగతులను ప్రారంభించడానికి  కావలసిన వసతులైన తరగతి గదులు,  ప్రయోగశాలలు సరిపడా లేవు. 11, 12 తరగతుల బోధనకు కావలసిన అధ్యాపకులను కొత్తగా నియమించుకోవాలి. లేదా ఇప్పుడున్న జూనియర్ కళాశాలల్లోని అధ్యాపకుల సర్వీసులను వినియోగించుకోవాలి. ఈ ప్రక్రియ ప్రారంభించాలంటే పాఠశాల విద్యా సర్వీస్ నిబంధనలను కొత్తగా రూపొందించి, నియామకాలకు ప్రక్రియ ప్రారంభించి జూన్‌‌‌‌‌‌‌‌లోగా కొత్త అధ్యాపకులు పాఠశాలలో చేరాలి.  లేదా ప్రస్తుత జూనియర్ కళాశాలలోని అధ్యాపకులను పాఠశాలల్లో నియమించాలి. 

ఇప్పటికే  మోడల్ స్కూళ్లు, కేజీబీవీ పాఠశాలలు, సర్వశిక్ష అభియాన్‌‌‌‌‌‌‌‌లో  పనిచేసే బోధన,  బోధ నేతర సిబ్బంది తమ వేతనాల పెంపు, ఇతర సర్వీస్ పరమైన ప్రయోజనాలు, రెగ్యులరైజేషన్ చేయాలని ఆందోళన చేస్తున్న అనుభవాలు విద్యాశాఖకు ఉన్నాయి.  ప్రశాంతమైన బోధనా వాతావరణం ఉండేవిధంగా చర్యలు తీసుకొని, అకడమిక్ కార్యకలాపాలు సజావుగా సాగేవిధంగా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలి. అప్పుడే విద్యార్థులు రాబోయే వృత్తి విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షలకు సిద్ధం అవుతారు. 

ఆ విశ్వాసం కలిగితేనే విద్యార్థులు తమ చదువును రాబోయే పాఠశాలల్లో తమ 11,12 తరగతుల విద్యను కొనసాగిస్తారు. మన ఇంటర్మీడియట్ విద్య దేశంలోనే అధిక ప్రమా ణాలతో ఉన్నది.  దేశ జనాభాలో మూడుశాతం కంటే తక్కువ ఉన్న తెలంగాణ జనాభా ఐఐటీలు, ఎన్‌‌‌‌‌‌‌‌ఐటీలకు అత్యధిక సంఖ్యలో అంటే సుమారు 10 శాతం మంది విద్యార్థులను పంపుతోంది. 

పటిష్టమైన బోధనా ప్రణాళిక అమలుచేయాలి

ఇప్పటికే గత సంవత్సరం వెయ్యికిపైగా పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంభించగా,  అక్కడ సరైన వసతులు లేక సరైన శిక్షణ పొందిన ఉపాధ్యాయులు లేక తాత్కాలికంగా బోధన ప్రక్రియ ప్రారంభించారు. తూతూ మంత్రంగా చెప్పుకోవడానికి మాత్రమే ఈ పూర్వ ప్రాథమిక తరగతులు నామమాత్రంగా కొనసాగుతున్నాయి.  ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో 35 శాతం నమోదు అవుతుండడం, 65% విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లడం మనం చూస్తున్నాం. 

ఇంటర్ తరగతుల పరిస్థితి అలా కాకుండా పటిష్టమైన బోధనా ప్రణాళిక అమలుచేస్తే తల్లిదండ్రుల విశ్వాసం చూడవచ్చు. లేకపోతే మరో విఫల ప్రయోగంగా మిగిలిపోతుంది. దీని ఫలితంగా ప్రైవేటు విద్యా వ్యాపారం విలసిల్లడానికి దోహదమవుతుంది.   ఇంటర్ విద్య అంటే 11, 12 తరగతుల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ వంటి గ్రూపులకు ప్రత్యేకంగా సబ్జెక్టులను బోధించే అధ్యాపకులు అవసరం. కానీ  ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం పని చేస్తున్న ఉపాధ్యాయులతో ఈ గ్రూపుల బోధనా ప్రక్రియ నిర్వహించడం సాధ్యం అవుతుందా? జూనియర్ కాలేజీల భవిష్యత్తు ఏమిటి?

గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటని, జువాలజీ, ఎకనామిక్స్, కామర్స్ వంటి సబ్జెక్టుల బోధనకు అర్హత కలిగిన అధ్యాపకుల నియామకాలు జరగాలి. సైన్స్ ప్రయోగశాలలు, కంప్యూటర్  ల్యాబ్‌‌‌‌‌‌‌‌లు, లైబ్రరీలు అందుబాటులో ఉండాలి. మన ఉన్నత పాఠశాలల్లో ఈ వసతులు కల్పించే ముందస్తు 
ప్రణాళిక చాలా అవసరం.  అప్పుడే విద్యార్థులు తమ 11, 12 తరగతుల చదువును అదే పాఠశాలలో కొనసాగిస్తారు.  లేనిచో ఉన్నత విద్యకోసం తిరిగి పట్టణ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది.  

ఇంటర్ బోర్డు రద్దు అయి ఎస్ఎస్‌‌‌‌‌‌‌‌సి, ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు కలిసి  ఒకే బోర్డు  ఏర్పాటయితే  జూనియర్ కాలేజీల భవిష్యత్తు ఏమిటి?  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో 9, 10 తరగతులు ప్రారంభిస్తారా అనే సందేహం కూడా ఉంది.  రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ విద్యా డైరెక్టర్ పరిధిలో దాదాపు 7,500 మంది సిబ్బంది ఉన్నారు. జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు,  బోధనేతర సిబ్బంది ఉద్యోగ భద్రత, పదవీ విరమణ  ప్రయోజనాలను  కాపాడతామని ప్రభుత్వం హామీ ఇస్తోంది.  

ఈ హామీల అమలుపై ఉద్యోగులకు అనేక సందేహాలు ఉన్నాయి. ఇంటర్  లెక్చరర్ల క్యాడర్ ఎలా ఉంటుంది?  ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌గా ఉన్నవారి హోదా ఏమిటి? పాఠశాల విద్యాశాఖలో వారి హోదా ఏమిటి?  సీనియారిటీ, పదోన్నతులు, బదిలీలు, జీతభత్యాలు, సర్వీసు ఎలా ఉండబోతున్నాయి? పదవీ విరమణ ప్రయోజనాల అమలు విషయాల్లో ఎలాంటి విధానం అనుసరిస్తారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు రావాలి.  కేవలం ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం హామీ ఇవ్వడం కాకుండా, సమగ్ర విధివిధానాలను ముందుగానే ప్రకటించి, ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని ఉద్యోగులు 
కోరుతున్నారు.

సబ్జెక్టు నైపుణ్యం కలిగిన అధ్యాపకులు అవసరంపాఠశాల విద్యాశాఖలో సుమారు లక్షా పదివేల మంది ఉపాధ్యాయులు ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్నారు. ఈ ఉపాధ్యాయుల మధ్య పదోన్నతుల కోసం, కామన్  సర్వీస్ రూల్స్ అమలు కోసం మూడు దశాబ్దాలుగా న్యాయ వివాదంతో  పోస్టులను భర్తీ చేయలేని అచేతన స్థితిలో ప్రభుత్వం ఉంది.  ఆ పరిస్థితి ఇప్పటి విలీనం తర్వాత రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.  విద్యార్థులకు ఒకే విద్యాసంస్థలో 12వ తరగతి వరకు విద్య అందించడం విధానపరంగా మంచి ఆలోచన. అయినప్పటికీ, అవసరమైన మౌలిక వసతులు కల్పించకుండా అమలుచేస్తే విద్యాప్రమాణాలు దెబ్బతింటాయని నిపుణులు అంటున్నారు. 

ఇంటర్ విద్యకు ప్రత్యేకమైన బోధనా విధానం, ప్రయోగశాలలు, సబ్జెక్టు నైపుణ్యం కలిగిన అధ్యాపకులు అవసరం. ఇలాంటి కీలక మార్పుపై అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో సమగ్రంగా చర్చించాలని కోరుతున్నారు. గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులకు పట్టణ విద్యార్థులతో సమానమైన అవకాశాలు కల్పించగలిగితే ఈ సంస్కరణకు సార్థకత ఉంటుంది.  లేకుంటే  కోరుకున్న గ్రూపులు అందుబాటులో లేక విద్యార్థులు 
మళ్లీ ప్రైవేటు విద్యాసంస్థలపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ముందుగా మౌలిక వసతులు, అధ్యాపకుల లభ్యత, కాలేజీల భవిష్యత్తు, ఉద్యోగుల హక్కులపై స్పష్టమైన విధానం ప్రకటించి ఆ తర్వాతే విలీన ప్రక్రియ చేపట్టాలి.

- కె. వేణుగోపాల్,
 విద్యారంగ విశ్లేషకుడు

ఓపెన్​పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
[email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.