సత్తుపల్లి, వెలుగు: ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన దేవాదుల, దుమ్ముగూడెం ప్రాజెక్టులు ఆగిపోయినా సీతారామ ప్రాజెక్టు ద్వారా సత్తుపల్లి నియోజకవర్గానికి గోదావరి జలాలు తీసుకొచ్చామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాబోయే సంక్రాంతి నాటికి వేశ్యకాంతల చెరువుకు కూడా గోదావరి నీటిని అందిస్తామని తెలిపారు. ఢిల్లీలో ఎన్జీటీ సమస్యలను పరిష్కరించుకుని, మే నెలకల్లా మరిన్ని ప్రాంతాలకు నీరందించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తామని చెప్పారు. సోమవారం సత్తుపల్లి మార్కెట్ యార్డులో రూ.11 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
అనంతరం నూతన పాలకవర్గ చైర్మన్ చల్లగుల్ల నర్సింహారావు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే రాగమయితో కలిసి పాల్గొని మాట్లాడారు. కల్లూరుగూడెంలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నిర్మాణంతో ఈ ప్రాంతంలో 3 వేల ఎకరాల్లో పామాయిల్ సాగు జరుగుతోందని, మరో 3 వేల ఎకరాలకు రైతులు ముందుకొస్తున్నారని తెలిపారు. పామాయిల్ రైతులకు శాశ్వత ప్రయోజనం చేకూర్చడంతో పాటు కోకో, మిరియాలు వంటి ఉద్యాన పంటల సాగుతో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. ఆగిపోయిన ఫుడ్ పార్క్, పామాయిల్ ఫ్యాక్టరీ, పులిగుండాల టూరిజం ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
ఖమ్మం జిల్లాకు విమానాశ్రయం, భద్రాద్రికి రైల్వే లైన్, సత్తుపల్లి మీదుగా కొవ్వూరు, పెనుబల్లి మీదుగా కొండపల్లికి రైల్వే మార్గాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఎల్‌నినో ప్రభావంతో ఎండలు, కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున నీటి లభ్యతను బట్టి పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. మార్కెట్ కమిటీకి అవసరమైన నిధులు, సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సర్వోత్తమ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ రాహుల్ రాజ్, ఉప సంచాలకులు పద్మావతి, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి సంతోష్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ రెహానా బేగం తదితరులు పాల్గొన్నారు.
