మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి..భీమవరం నుంచి ఢిల్లీకి 60 ఏండ్ల వృద్ధురాలు సైకిల్ యాత్ర

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి..భీమవరం నుంచి ఢిల్లీకి 60 ఏండ్ల వృద్ధురాలు సైకిల్ యాత్ర

నేరడిగొండ, వెలుగు: మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఏపీలోని భీమవరం నుంచి ఢిల్లీ వరకు 3 వేల కిలోమీటర్ల 'నషా ముక్త్ భారత్' సైకిల్ యాత్ర చేపట్టిన 62 ఏళ్ల డాక్టర్ ఇందుకూరి విజయలక్ష్మి సోమవారం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేజీబీవీ విద్యార్థులకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. నేటి యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మత్తు వ్యసనం కారణంగా తన భర్తను కోల్పోయిన బాధతోనే ఈ యాత్రకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. 

50 రోజుల పాటు ఈ యాత్ర సాగుతోందని వివరించారు. విద్యార్థినులు చదువుతో పాటు సామాజిక బాధ్యతను కలిగి ఉండాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ కుటుంబ సభ్యులు, పరిసరాల వారిలో చైతన్యం కల్పించాలని పిలుపునిచ్చారు. విజయలక్ష్మిని కేజీబీవీ ఎస్‌‌‌‌వో రజిత, టీచర్ల బృందం ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ‘నషా ముక్త్ భారత్' ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎస్సై సయ్యద్ ఇమ్రాన్, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.