ముంబై: విదేశీ ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐల) కొనుగోళ్ల జోరు కొనసాగడం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఫైనాన్షియల్స్, ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్ల అండతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 512.34 పాయింట్లు (0.63శాతం) లాభపడి 82,104.79 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఒక దశలో 719 పాయింట్లకు పైగా ఎగబాకి 82,311 స్థాయిని తాకింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 146.80 పాయింట్లు (0.58శాతం) పెరిగి 25,291.10 వద్ద ముగిసింది.
సెన్సెక్స్‌లో ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్, ఎటర్నల్, పవర్ గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ ఎక్కువగా లాభపడగా, టాటా స్టీల్, మారుతీ, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో), బజాజ్ ఫిన్‌సర్వ్ నష్టపోయాయి. లార్జ్-క్యాప్ షేర్లలో కొనుగోళ్లు కనిపించినప్పటికీ, బ్రాడ్ మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ సెలెక్ట్ సూచీ 0.92శాతం, స్మాల్‌క్యాప్ సెలెక్ట్ సూచీ 0.71శాతం మేర నష్టపోయాయి.
ఎఫ్‌ఐఐలు శుక్రవారం నికరంగా రూ. 5,736.55 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, సోమవారం మరో రూ.4,865 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (డీఐఐలు) రూ.3,500 కోట్ల విలువైన షేర్లు అమ్మారు. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.34శాతం తగ్గి 95.51 డాలర్లకు చేరడం మార్కెట్ సెంటిమెంట్‌కు బలాన్నిచ్చింది.
