టీవీఎస్ కుటుంబంలో ఆస్తి వివాదం.. తండ్రి వేణు శ్రీనివాసన్‌‌‌‌కు కుమార్తె లక్ష్మి నోటీసులు!

టీవీఎస్ కుటుంబంలో ఆస్తి వివాదం.. తండ్రి వేణు శ్రీనివాసన్‌‌‌‌కు కుమార్తె లక్ష్మి నోటీసులు!

న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టీవీఎస్ కుటుంబంలో వారసత్వ, ఆస్తి పంపకాల వివాదం మరింత ముదిరింది. ఉమ్మడి కుటుంబ ఆస్తుల్లో తనకు న్యాయబద్ధమైన సమాన వాటా కావాలని కోరుతూ వేణు శ్రీనివాసన్ కుమార్తె లక్ష్మి వేణు సోమవారం తన తండ్రికి అధికారికంగా ఆస్తి పంపకపు (పార్టిషన్) నోటీసు పంపారు. లక్ష్మి డిమాండ్‌‌‌‌కు ఆమె తల్లి మల్లికా శ్రీనివాసన్ బహిరంగంగా మద్దతు తెలపడంతో కుటుంబంలోని విభేదాలు తారస్థాయికి చేరాయి.

వివాదం ఏమిటంటే..?

హిందూ వారసత్వ చట్టం (సెక్షన్ 6) ప్రకారం ఉమ్మడి కుటుంబ ఆస్తుల్లో కుమారుడితో సమానంగా కుమార్తెకు కూడా హక్కు ఉంటుందని లక్ష్మి స్పష్టం చేశారు. వీఎస్ ట్రస్ట్ ద్వారా ఉన్న టీవీఎస్ హోల్డింగ్స్, టీవీఎస్ మోటార్, టీవీఎస్ క్రెడిట్, సుందరం- క్లేటన్ సంస్థల వాటాల్లో తనకూ సమాన వాటా ఇవ్వాలని ఆమె కోరారు.  2020లో  టీవీఎస్ కుటుంబం మధ్య ఆస్తుల విభజన జరిగినప్పటికీ, తమ సొంత కుటుంబంలో ఆస్తుల పంపకం జరగలేదని లక్ష్మి పేర్కొన్నారు. తన సోదరుడు సుదర్శన్ వేణుకు అనుకూలంగా ఆస్తుల ప్రయోజనాలను కేంద్రీకరించి, తన హక్కులను కాలరాస్తున్నారని ఆమె ఆరోపించారు. 

"చట్టం ముందు పితృస్వామ్య ధోరణులకు చోటు లేదు" అని ఆమె వ్యాఖ్యానించారు. ఒక తల్లిగా తనకు కొడుకు, కూతురు ఇద్దరూ సమానమేనని, లక్ష్మికి సమాన వాటా దక్కాలని మల్లికా శ్రీనివాసన్ మద్దతు పలికారు. మరోవైపు, 2024 మార్చిలో కుదిరిన ఒప్పందం ప్రకారం పంపకాలు పూర్తయ్యాయని, అవి తన స్వార్జిత ఆస్తులని వేణు శ్రీనివాసన్ వాదిస్తున్నారు. ఈ విషయంపై  ఇరువర్గాలు ఇప్పటికే  కోర్టుకు వెళ్లారు.