• మొత్తం అంచనా వ్యయం రూ. 2,010.40 కోట్లకు పెంచుతూ రివైజ్డ్ శాంక్షన్
• ఆర్ అండ్ బీ వాటా రూ. 1,535.40 కోట్లకు పెంపు
• టీజీఎంఎస్ఐడీసీకి యథాతథంగా రూ. 475 కోట్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఫేజ్-2 కింద ఏర్పాటు చేస్తున్న 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీల భవన నిర్మాణాలు, మౌలిక వసతుల కోసం ప్రభుత్వం రూ. 365.40 కోట్లు అదనంగా మంజూరు చేసింది. గతంలో ఇచ్చిన రూ. 1,645 కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ను రూ. 2,010.40 కోట్లకు సవరిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు జీవో 175ను జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కొమరం భీం ఆసిఫాబాద్, జనగామ, నిర్మల్ కాలేజీలకు ఈ నిధులు వర్తిస్తాయి. ఆర్ అండ్ బీ వాటాను రూ. 1,170 కోట్ల నుంచి రూ. 1,535.40 కోట్లకు పెంచిన ప్రభుత్వం, టీజీఎంఎస్ఐడీసీ వాటాను రూ. 475 కోట్లుగా యథాతథంగా కొనసాగించింది.
ఎన్ఎంసీ నిబంధనల మేరకు పనులు..
2022 లో ఈ 9 కాలేజీలకు రూ. 1,645 కోట్లు మంజూరు కాగా, ఇందులో ఆర్ అండ్ బీకి కాలేజీకి రూ. 130 కోట్ల చొప్పున రూ. 1,170 కోట్లు, టీజీఎంఎస్ఐడీసీకి రూ. 475 కోట్లు (హాస్పిటల్స్ అప్ గ్రేడేషన్ కు రూ. 240 కోట్లు, పరికరాలకు రూ. 235 కోట్లు) కేటాయించారు. ఫైనలైజ్ జీఎఫ్ సీ డ్రాయింగ్స్, జియోటెక్నికల్ పరిశీలన, ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం బాయ్స్-గర్ల్స్ హాస్టళ్లు, కిచెన్-డైనింగ్ బ్లాకులు, ప్రిన్సిపాల్ క్వార్టర్స్, గెస్ట్ హౌస్ లు, డబ్ల్యూటీపీ, ఎస్టీపీ, రోడ్లు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణానికి అదనంగా రూ. 365.40 కోట్లు అవసరమని ఆర్ అండ్ బీ సీఈ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ప్రస్తుత 2026-27 ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం కొత్త టెండర్లు పిలిస్తే వ్యయంతో పాటు డీ మొబిలైజేషన్, రీ-ఎస్టాబ్లిష్ మెంట్ భారం పడుతుందని సీఈ తెలపడంతో, 2023-26 ఎస్ఎస్ఆర్ రేట్ల ఆధారంగా గతంలో అంగీకరించిన ధరలకే ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టు ఏజెన్సీలతో బ్యాలెన్స్ పనులు చేయించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
సవరించిన నిధులు ఇలా..
సవరించిన కేటాయింపుల్లో భాగంగా ఆర్ అండ్ బీ కింద అత్యధికంగా కొమరం భీం ఆసిఫాబాద్ కాలేజీకి రూ. 73.40 కోట్లు అదనంగా మంజూరు చేయగా, ఆ కాలేజీ మొత్తం అంచనా రూ. 242.40 కోట్లకు చేరింది. ఖమ్మం కాలేజీకి రూ. 63.40 కోట్లు (మొత్తం రూ. 229.70 కోట్లు) అదనంగా ఇచ్చారు. నిర్మల్ కాలేజీకి రూ. 44.40 కోట్లు (మొత్తం రూ. 213.60 కోట్లు), వికారాబాద్ కాలేజీకి రూ. 41 కోట్లు (మొత్తం రూ. 276 కోట్లు), జయశంకర్ భూపాలపల్లికి రూ. 39 కోట్లు (మొత్తం రూ. 207 కోట్లు), కరీంనగర్ కు రూ. 29.40 కోట్లు (మొత్తం రూ. 187.15 కోట్లు) అదనంగా కేటాయించారు. జనగామ కాలేజీకి రూ. 25.40 కోట్లు (మొత్తం రూ. 215.40 కోట్లు), రాజన్నసిరిసిల్ల కాలేజీకి రూ. 25 కోట్లు (మొత్తం రూ. 191 కోట్లు), కామారెడ్డి కాలేజీకి రూ. 24.40 కోట్లు (మొత్తం రూ. 248.15 కోట్లు) అదనంగా మంజూరు చేశారు.
