ఎస్పీతో సీట్ల సర్దుబాటు బాధ్యత ప్రియాంకకు అప్పగింత 

ఎస్పీతో సీట్ల సర్దుబాటు బాధ్యత ప్రియాంకకు అప్పగింత 

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సమాజ్‌‌‌‌‌‌‌‌వాదీ పార్టీ(ఎస్పీ)తో జరగబోయే సీట్ల సర్దుబాటు చర్చలకు కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ నాయకత్వం వహించనున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లోనూ సమాజ్‌‌‌‌‌‌‌‌వాదీ పార్టీతో పొత్తుల చర్చలను విజయవంతంగా నడిపిన అనుభవం ప్రియాంక గాంధీకి ఉంది. ఈసారి కూడా ఆమె అందరితో చర్చలు జరిపి, సీట్ల పంపకాల విషయంలో సందిగ్ధతను తొలగిస్తారని, ఇండియా కూటమి నేతలను సమన్వయం చేయగలరని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 

ఈ క్రమంలోనే సోమవారం ఢిల్లీలోని రాజాజీ మార్గ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ప్రియాంక నివాసంలో యూపీకీ చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతల ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ భేటీలో యూపీ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. కూటమి భాగస్వాముల గురించి మీడియాలో అనవసరమైన ప్రకటనలు చేయవద్దని యూపీ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్ రాజేంద్ర పాల్ గౌతమ్, యూపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ ఇమ్రాన్ మసూద్‌‌‌‌‌‌‌‌లను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ ఆదేశించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. యూపీలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా కూటమి ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 

డిసెంబర్ మొదటి వారం నుంచే ప్రచారం

ఈ ఎన్నికల్లో పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ మొదటి వారం నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఖర్గే రాష్ట్రవ్యాప్తంగా పలు భారీ బహిరంగ సభలు, యాత్రల్లో పాల్గొననున్నారు. సీట్ల సర్దుబాటుపై అధికారిక చర్చలు ఇంకా ప్రారంభం కావాల్సి ఉందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తెలిపారు. కేవలం సీట్ల సర్దుబాటే కాకుండా.. పరస్పర గౌరవం, అభ్యర్థుల గెలుపు సామర్థ్యాల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 

తెరపైకి మరో కూటమి

మరోవైపు.. యూపీ రాజకీయాల్లో సరికొత్త కూటమి తెరపైకి వచ్చింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆజాద్ సమాజ్ పార్టీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కలిసి 'సామాజిక పరివర్తన మోర్చా' పేరుతో కొత్త రాజకీయ వేదికను ప్రకటించారు. ఈ కూటమి తరఫున చంద్రశేఖర్ ఆజాద్‌‌‌‌‌‌‌‌ను సీఎం అభ్యర్థిగా ఖరారు చేశారు. రాష్ట్రంలోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తామని వారు వెల్లడించారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన ధ్యేయమని తెలిపారు.