జీతం మొత్తం రూ. 70 లక్షలు.. ఆస్తులు మాత్రం 30 కోట్లు! టౌన్ ప్లానింగ్ అధికారి అవినీతి చిట్టా

జీతం మొత్తం రూ. 70 లక్షలు.. ఆస్తులు మాత్రం 30 కోట్లు! టౌన్ ప్లానింగ్ అధికారి అవినీతి చిట్టా

• 2016లో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఆఫీసర్ గా చేరిన గుండు వాణి
• వికారాబాద్, మొయినాబాద్, చేవెళ్ల, శంకరపల్లి మున్సిపాలిటీల్లో డ్యూటీ
• కూడబెట్టిన అక్రమాస్తులు రూ. 6.76 కోట్లకు పైమాటే..
• ఏకకాలంలో 8 చోట్ల ఏసీబీ సోదాలు

హైదరాబాద్, వెలుగు: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గుండు వాణి అవినీతి ఆస్తుల వ్యవహారం బయటికి వచ్చింది. టౌన్ ప్లానింగ్ అధికారిగా కేవలం పదేండ్ల వ్యవధిలోనే రూ. 6.76 కోట్లు విలువ చేసే అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ దర్యాప్తులో బయటపడింది. వీటి విలువ ప్రస్తుత బహిరంగ మార్కెట్ ప్రకారం రూ. 30 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. లంచాలు వసూలు చేసిన డబ్బును కూతురు పేరిట ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ సంస్థ ద్వారా మళ్లించినట్లు గుర్తించారు. 

జీ+3 బిల్డింగ్ నిర్మాణ అనుమతుల కోసం రూ. 75 వేలు లంచం తీసుకుంటూ సెప్టెంబర్ 30న గుండు వాణి ఏసీబీకి చిక్కిన సంగతి తెలిసిందే. గ్రామ పంచాయతీ మాజీ సెక్రటరీ ఎలమోని సుదర్శన్ మధ్యవర్తిగా లంచం తీసుకున్న వాణిని ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఆమె ప్రస్తుతం చంచల్ గూడ విమెన్ జైలు రిమాండ్ లో ఉన్నారు. కాగా, టౌన్ ప్లానింగ్ అధికారిగా అక్రమాస్తులు కూడబెట్టారనే సమాచారంతో ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది.

బిల్డింగ్స్ విస్తీర్ణం, ఫ్లోర్లను బట్టి లం చాలు వసూలు

హైదరాబాద్ ఆసిఫ్ నగర్ కు చెందిన గుండు వాణి 2016లో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఆఫీసర్ గా ఉద్యోగంలో చేరింది. ఆ తర్వాత, 2021లో టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా పదోన్నతి పొందారు. వికారాబాద్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేశారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మొయినాబాద్, చేవెళ్ల, శంకరపల్లి మున్సిపాలిటీల ఓడీగా అదనపు బాధ్యతలు నిర్వహించింది. కాగా, ఇంటి నిర్మాణాల కోసం వస్తున్న దరఖాస్తులను ఆసరాగా చేసుకుని ఆయా బిల్డింగ్స్ విస్తీర్ణం సహా ఫ్లోర్లను బట్టి లంచాలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి పదేండ్ల కాలంలో జీతభత్యాలు మొత్తం కలిపి రూ. 70 లక్షలు మేర మాత్రమే అధికారిక సంపాదన ఉంటుందని ఏసీబీ అధికారులు లెక్కలు తేల్చారు. కానీ అధికారిని అడ్డంపెట్టుకుని దాదాపు రూ. 6.76 కోట్లు అక్రమార్జన కింద సంపాదించినట్లు గుర్తించారు.

వైన్స్, షేర్స్ లో రూ. 2 కోట్లు పెట్టుబడి

చరాస్తులు, పెట్టుబడుల విలువలు కూడా సోదాల్లో బయటపడ్డాయి. రూ. 5.47 లక్షల నగదు, మహబూబ్ నగర్ లోని తుల్జా భవానీ వైన్స్ లో రూ. 50 లక్షల పెట్టుబడి, షేర్లలో రూ. 1.30 కోట్ల పెట్టుబడులను గుర్తించారు. బ్యాంకు ఖాతాల్లో నిల్వ ఉన్న రూ. 7.97 లక్షలు ఫ్రీజ్ చేశారు. సుమారు 175.1 గ్రాముల బంగారు నగలు, మహీంద్రా ఎక్స్ యూవీ 700, హ్యుందాయ్ క్రెటా కార్లు, రెండు బైక్ లను సీజ్ చేశారు. ఇంట్లోని వస్తువుల విలువ రూ. 5.10 లక్షలుగా అంచనా వేశారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ ప్రస్తుత బహిరంగ మార్కెట్ లో దాదాపు రూ. 30 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ క్రమంలోనే మొయినాబాద్ కు చెందిన మహ్మద్ ఖమర్ నుంచి రూ. 75 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కింది.

లం చం డబ్బులు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి..

లంచంగా తీసుకున్న డబ్బును వాణి భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి మళ్లించినట్లు గుర్తించారు. కూతురు పేరిట ఏర్పాటు చేసిన ఓ సంస్థ ద్వారా పెట్టుబడులు పెడుతున్నట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. ఈ మేరకు ఏసీబీ అధికారులు సోమవారం తెల్లవారుజాము నుంచే సోదాలు నిర్వహించారు. అత్తాపూర్ లో ఆమె నివాసం ఉంటున్న ఫ్లాట్ తో పాటు జడ్చర్ల, జనగామ సహా మొత్తం 8 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అత్తాపూర్ లో రూ. 63 లక్షల విలువైన ఫ్లాట్ తో పాటు, అదే ప్రాంతంలో జీ+2 బిల్డింగ్ గుర్తించారు. దీని విలువ సుమారు రూ. 2.45 కోట్లుగా అంచనా వేశారు. మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలంలో రూ. 29.70 లక్షలు విలువ చేసే 1.10 ఎకరాల వ్యవసాయ భూమి, జడ్చర్లలో 283.11 చదరపు గజాలు, జనగామ జిల్లా పాలకుర్తిలో 424 చదరపు గజాల విస్తీర్ణంలో రెండు ఓపెన్ ప్లాట్లు గుర్తించారు. వీటి విలువ రూ. 87.67 లక్షలుగా అంచనా వేశారు.