మంఖల్‌లోని టీజీఐఐసీ ప్లాస్టిక్ పార్క్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్‌ఎస్ ఇండస్ట్రీస్ (NS Industries)ను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (KLR) పాల్గొన్నారు.
తెలంగాణను పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తూ, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కొత్త పరిశ్రమల స్థాపన ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందన్నారు. పరిశ్రమలు రావడం అంటే కేవలం భవనాలు, యంత్రాలు ఏర్పాటు చేయడం మాత్రమే కాదని, స్థానిక యువతకు ఉద్యోగాలు, కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో MLC తక్కల్లపల్లి రవీందర్, DCC రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు చిగురింత పారిజాత రెడ్డి , సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదరిగి, పలువురు ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు
