బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన ఎప్పుడో? ..అక్టోబర్‌‌లోనే అభ్యర్థుల ప్రకటన అంటూ హడావిడి

బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన ఎప్పుడో? ..అక్టోబర్‌‌లోనే అభ్యర్థుల ప్రకటన అంటూ హడావిడి
  • నవంబర్ సగమైనా తేలని పేర్లు
  • ప్రచారంలో కాంగ్రెస్, జనసేన.. కమలంలో ఎదురుచూపులు

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులెవరనేది ఇంకా తేలడం లేదు. అక్టోబర్‌‌లోనే పేర్లు ప్రకటిస్తామంటూ అప్పట్లో హడావిడి చేసిన రాష్ట్ర నాయకత్వం.. నవంబర్ సగం గడిచినా జాబితా విడుదల చేయకపోవడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కాంగ్రెస్, జనసేన ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలోకి దిగడంతో కమలం నేతల్లో ఆందోళన పెరుగుతున్నది.

వచ్చే మార్చిలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌‌నగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటి కోసం సీనియర్ నేతలతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసిన బీజేపీ.. హైదరాబాద్, వరంగల్ కేంద్రాల్లో ఆశావహుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. కమిటీల నివేదికల ఆధారంగా అభ్యర్థుల పేర్లను హైకమాండ్​కు పంపింది. దీంతో అక్టోబర్ నెలాఖరులోనే ప్రకటన వస్తుందని భావించినా.. ఇప్పటివరకు తుది జాబితా విడుదల కాలేదు.

అభ్యర్థుల ఖరారు కాకపోవడంతో ప్రచారం ప్రారంభించాలా వద్దా అనే సందిగ్ధంలో ఆశావహులు ఉన్నారు. హైదరాబాద్ సెగ్మెంట్‌‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పేరు దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతున్నది. ఆయన పోటీకి నిరాకరిస్తే పవన్ కుమార్, అమర్ నాథ్, ఎన్వీ సుభాష్ పేర్లను పరిశీలించే అవకాశం ఉంది. వరంగల్ సెగ్మెంట్‌‌లోనూ పలువురు నేతలు టికెట్ ఆశిస్తున్నారు.

కాంగ్రెస్, జనసేన అభ్యర్థుల ప్రచారం

కాంగ్రెస్ రెండు నెలల క్రితమే హైదరాబాద్ స్థానానికి సామ రామ్మోహన్ రెడ్డి, వరంగల్ స్థానానికి సర్వోత్తమ్ రెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించింది. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు యువజన కాంగ్రెస్ ఇన్‌‌చార్జీలను నియమించి ఓటర్ల నమోదు, ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఎన్డీయే మిత్రపక్షమైన జనసేన కూడా మూడు నెలల క్రితమే వరంగల్ స్థానానికి గడల శ్రీనివాసరావును ప్రకటించింది. పీఆర్టీయూ అభ్యర్థిగా ఆ సంఘం నేత భిక్షంగౌడ్ పేరును ప్రకటించింది. పలు చిన్న పార్టీలు కూడా అభ్యర్థులను రంగంలోకి దించాయి.  

పొత్తు లెక్కలతోనే ఆలస్యమా?

అభ్యర్థుల ప్రకటన ఆలస్యానికి జనసేనతో పొత్తు అంశమే ప్రధాన కారణమనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతున్నది. వరంగల్ స్థానానికి జనసేన ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించగా.. బీజేపీలోనూ పలువురు సీనియర్లు టికెట్ ఆశిస్తున్నారు. దీంతో హైకమాండ్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. పొత్తులో భాగంగా హైదరాబాద్‌‌లో బీజేపీ, వరంగల్‌‌లో జనసేన పోటీ చేసే అవకాశముందనే ప్రచారం జరుగుతున్నది.

వరంగల్‌‌లో బీజేపీకి పెద్దగా బలం లేదని, ఆ స్థానాన్ని జనసేనకు ఇచ్చినా నష్టం ఉండదనే వాదన కూడా పార్టీలో వినిపిస్తున్నది. మరోవైపు హైదరాబాద్ నుంచి రాంచందర్ రావు పోటీ చేస్తారా? లేక మరొకరికి అవకాశం ఇస్తారా? అన్నది స్పష్టత రావాల్సి ఉంది.