బాధ్యతలను విస్మరించిమాపైనే నిందలా?..రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆరోపణలు

బాధ్యతలను విస్మరించిమాపైనే నిందలా?..రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆరోపణలు

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం తన బాధ్యతలను విస్మరించి ప్రతి అంశానికీ మిల్లర్లనే బాధ్యులను చేస్తోందని రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పాడి గణపతిరెడ్డి ఆరోపించారు. కొత్త సీఎంఆర్ అగ్రిమెంట్‌లో ఐదురెట్ల సాల్వెన్సీ, బ్యాంక్ గ్యారంటీలు, ష్యూరిటీల పేరుతో మిల్లర్లపై ఆర్థిక భారం మోపుతున్నారని ఆయన సోమవారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.

ధాన్యం సేకరణ జాప్యం, రవాణా, హమాలీ, ఫ్యూమిగేషన్, ఎఫ్‌సీఐ కఠిన నిబంధనలతో మిల్లర్లు నష్టపోతున్నారని తెలిపారు.ఇరుపక్షాలకు ఆమోదయోగ్యంగా కొత్త ఒప్పందాన్ని రూపొందించాలని.. 2014 నుంచి పెండింగ్‌లో ఉన్న మిల్లింగ్, రవాణా, డ్రైయేజ్, కస్టోడియన్ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. క్వింటాల్‌కు మిల్లింగ్ చార్జీని రూ.150కి, పాత గన్నీ బ్యాగ్ ధరను రూ.11కి పెంచాలన్నారు.

నాణ్యమైన ఎఫ్‌ఏక్యూ ధాన్యం సరఫరాతో పాటు వానాకాలం ధాన్యాన్ని రా రైస్‌గా, యాసంగి ధాన్యాన్ని బాయిల్డ్ రైస్‌గా మాత్రమే తీసుకోవాలని, రెండు సీజన్లకు వేర్వేరుగా టెస్ట్ మిల్లింగ్ నిర్వహించి ఔటర్న్ రేషియో నిర్ణయించాలని కోరారు. 25 శాతం పెనాల్టీ, 12 శాతం వడ్డీ మాఫీ చేయాలని, 2022–23 రబీ టెండర్ ధాన్యానికి న్యాయమైన ధర నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. నాన్‌ విల్‌ఫుల్ డిఫాల్టర్లకు నాలుగు విడతల్లో బకాయిల చెల్లింపు అవకాశం ఇచ్చి, నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.