- • బీరులో మత్తుమందు కలిపి బంగారం దోపిడీ
- • ఐదుగురు నిందితుల అరెస్ట్.. మరో నిందితుడు పరారీ
మల్కాజిగిరి, వెలుగు: ఆన్ లైన్ డేటింగ్ యాప్ లను అడ్డం పెట్టుకుని అమాయకులను టార్గెట్ చేస్తూ బంగారం దోచుకుంటున్న ముఠాను మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం మల్కాజిగిరి కమిషనరేట్ లో సీపీ సుమతి మీడియాకు వివరాలు వెల్లడించారు. నిందితులు 'గ్రైండర్' డేటింగ్ యాప్ లో నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి బాధితులతో చాటింగ్, వీడియో కాల్స్ ద్వారా పరిచయాలు పెంచుకునేవారు.
బాధితుల వ్యక్తిగత అలవాట్లు, ఒంటరిగా ఉంటున్నారా, ఇళ్లలో బంగారు నగలు ఎక్కడ ఉంటాయి అనే వివరాలను సేకరిస్తారు. వ్యక్తిగతంగా కలిసేందుకు బాధితుల ఇళ్లకు వెళ్లి, వారు తెచ్చిన బీరు బాటిళ్లలో మత్తు పదార్థాలు కలిపి ఇచ్చేవారు. బాధితులు స్పృహ కోల్పోయిన వెంటనే వారి వద్ద ఉన్న బంగారు నగలు, విలువైన వస్తువులతో పరారయ్యేవారు.
పట్టుబడిన నిందితులు, అరెస్ట్..
నవంబర్ 16న ఉప్పల్, కుషాయిగూడ పీఎస్ ల ప్రత్యేక బృందాలు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నాయి. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. పట్టుబడ్డ వారిలో తేజావత్ సంతోష్, రెడ్డిగారి దినేశ్ కుమార్ రెడ్డి, మొహమ్మద్ ఆరిఫ్, బానోతు విద్యాసాగర్, బానోతు కార్తీక్ (18) ఉన్నారు. పరారీలో ఉన్న నిందితుడు చందు కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఉప్పల్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉదయం 10 గంటల సమయంలో ముగ్గురిని ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేయగా, మరో ఇద్దరిని ఏఎస్ రావు నగర్ వద్ద కుషాయిగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
14 కేసులతో సంబంధం..భారీగా బంగారం స్వాధీనం
ఈ ముఠాకు మల్కాజిగిరి, సైబరాబాద్, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లతో పాటు విశాఖపట్నంలో నమోదైన ఓ కేసుతో కలిపి మొత్తం 14 కేసులతో సంబంధం ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. వివిధ కేసుల ద్వారా సుమారు 200 గ్రాములకు పైగా బంగారు నగలు చోరీకి గురైనట్లు గుర్తించి రికవరీ చేశారు. నిందితులు ఉపయోగించిన ఫోన్లు, డేటింగ్ యాప్ ప్రొఫైల్స్, చాటింగ్ వివరాలు, వీడియో కాల్స్, కాల్ డేటా ఆధారాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
