ఒకప్పుడు ఇంట్లో వండుకున్న వేడివేడి ఆహారాన్ని అమృతంలా భావించేవాళ్లం. నేడు మారిన జీవనశైలి, పని ఒత్తిడి వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ బండ్లమీద ఆధారపడటం నిత్యకృత్యమైంది. అయితే, మనం ఎంతో ఇష్టంగా, రూ. వేలు ఖర్చు పెట్టి తింటున్న ఆహారం ఎంతవరకు సురక్షితం? ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహిస్తున్న ఆకస్మిక దాడుల్లో బయటపడుతున్న నిజాలు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.
నగరాల్లోని బడాబడా స్టార్ హోటళ్ల నుంచి మొదలుకొని, వీధి చివర ఉండే టిఫిన్ సెంటర్ల వరకు ఎక్కడా పరిశుభ్రత అన్నమాటే కనిపించడం లేదు.
ఫ్రిజ్‌లలో నెలల తరబడి నిల్వ ఉంచిన కుళ్లిపోయిన మాంసం, కాలం చెల్లిన మసాలాలు, బూజు పట్టిన బ్రెడ్లు, కలుషితమైన నూనెలతో వంటకాలు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. వంటశాలల్లో బొద్దింకలు, ఎలుకల సంచారం చూస్తుంటే అసలు మనం తింటున్నది ఆహారమా లేక అనారోగ్యమా అన్న భయం కలుగుతోంది.
నిత్య జీవితంలో కల్తీ భూతం
కేవలం హోటళ్లలోనే కాదు, మనం నిత్యం ఇంట్లో వాడుకునే సరుకుల్లోనూ కల్తీ రాజ్యమేలుతోంది. ఉదయం తాగే పాల నుంచి రాత్రి తినే అన్నంవరకు అన్నీ కల్తీమయమే. పాలలో యూరియా, డిటర్జెంట్ పౌడర్ కలపడం, కారం పొడిలో ఇటుక పొడి, పసుపులో రసాయన రంగులు, నెయ్యిలో జంతువుల కొవ్వు కలపడం వంటి దారుణాలు నిత్యం వెలుగుచూస్తున్నాయి.
స్వీట్ల తయారీలో కృత్రిమ రంగులు, నాసిరకం సరుకులు వాడుతూ ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్నారు. కల్తీ ఆహారం తినడం వల్ల తక్షణమే ఫుడ్ పాయిజనింగ్, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు రావడమే కాకుండా, దీర్ఘకాలంలో ప్రాణాంతక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఆహారంలో వాడే హానికరమైన రసాయనాలు, సింథటిక్ రంగుల వల్ల చిన్న వయసులోనే కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, జీర్ణకోశ సమస్యలు పెరుగుతున్నాయి.
పరిష్కారం ఏమిటి..?
ఈ కల్తీ మహమ్మారిని అరికట్టాలంటే ప్రభుత్వ యంత్రాంగం మరింత కఠినంగా వ్యవహరించాలి. ఫుడ్ సేఫ్టీ దాడులు కేవలం అప్పుడప్పుడు హడావిడిగా కాకుండా నిరంతర ప్రక్రియలా కొనసాగాలి. కల్తీకి పాల్పడేవారిపై కేవలం జరిమానాలు విధించి వదిలేయకుండా, వారి లైసెన్సులు శాశ్వతంగా రద్దు చేసి కఠిన జైలు శిక్షలు విధించాలి. ఇంటి భోజనానికి అలవాటు పడటం, ప్యాకేజ్డ్ ఫుడ్ కొనేటప్పుడు గడువు తేదీ (ఎక్స్‌పైరీ డేట్), ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ మార్క్ గమనించడం అలవాటు చేసుకోవాలి.
- కాదాసి అమరేందర్
సోషల్ ఎనలిస్ట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
[email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
