వెలుగు స్పెషల్: తెలంగాణ సమగ్ర అభివృద్ధికి రెండో రాజధాని వరంగల్ కావాలి..!

వెలుగు స్పెషల్: తెలంగాణ సమగ్ర అభివృద్ధికి రెండో రాజధాని వరంగల్ కావాలి..!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రజలు అన్ని జిల్లాలు పారిశ్రామికంగా, విద్యాపరంగా, వ్యవసాయపరంగా, వైద్యపరంగా అభివృద్ధి చెందాలని ఆశించారు. అయితే, ఐటీ సంస్థలు, భారీ పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, పెట్టుబడులు ఎక్కువగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే  కేంద్రీకృతమవుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన అభివృద్ధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. అందుకు వరంగల్‌‌‌‌‌‌‌‌ను తెలంగాణ రెండో రాజధానిగా అభివృద్ధి చేసే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలించాలి. ఒకే నగరంలో అభివృద్ధి కాదు. తెలంగాణలోని ప్రతి ప్రాంతంలో అభివృద్ధి జరగాలి. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు తోడుగా వరంగల్ ఎదగాలి.  తెలంగాణ సమృద్ధి నిర్మాణం కావాలి!

హైదరాబాద్ తరువాత వరంగల్– హనుమకొండ ప్రాంతానికి ప్రత్యేకమైన చారిత్రక, సాంస్కృతిక, విద్యా, వాణిజ్య ప్రాధాన్యత ఉంది.  కాకతీయుల చారిత్రక  వైభవానికి  ప్రతీకగా నిలిచిన వరంగల్ కోట, వేయిస్తంభాల గుడి, భద్రకాళి దేవాలయం, యునెస్కో గుర్తింపు పొందిన  రామప్ప దేవాలయం ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. 

ఈ అనుకూలతలను ఉపయోగించుకొని వరంగల్‌‌‌‌‌‌‌‌ను ఆధునిక మహానగరంగా తీర్చిదిద్దాలి. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కే పరిశ్రమలు పరిమితం కాకుండా వరంగల్‌‌‌‌‌‌‌‌లో ప్రత్యేక పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేయాలి.  గ్రానైట్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ విడిభాగాలు, టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్, ఫుడ్ ప్రాసెసింగ్, మెడికల్ పరికరాల తయారీ, లాజిస్టిక్స్ పరిశ్రమలను ప్రోత్సహించాలి.  దీనివల్ల పరిసర జిల్లాలకు కూడా అభివృద్ధి అవకాశాలు లభిస్తాయి.

యువతకు ఉపాధి

ఐటీ పార్కులు, సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ కంపెనీలు, పరిశోధనా కేంద్రాలు, కార్పొరేట్ కార్యాలయాలు ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక యువతకు సొంత ప్రాంతం
లోనే  ఉద్యోగాలు కల్పించాలి.  పత్తి, మిర్చి, వరి, పసుపు వంటి వ్యవసాయ ఉత్పత్తులకు స్థానికంగా విలువ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలి.  కోల్డ్ స్టోరేజీలు, గోదాములు, ఆధునిక మార్కెట్ యార్డులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు,  ఎగుమతి కేంద్రాలను ఏర్పాటు చేసి  రైతుల ఆదాయాన్ని పెంచాలి.  వరంగల్ విమానాశ్రయ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. కాజీపేట రైల్వే జంక్షన్‌‌‌‌‌‌‌‌ను  ఆధునీకరించి  రైల్వే కనెక్టివిటీ, జాతీయ రహదారులు, రింగ్ రోడ్లు, ఆధునిక బస్ టెర్మినళ్లు, లాజిస్టిక్స్ పార్కులను అభివృద్ధి చేయాలి.

విద్య, వైద్య రంగాల విస్తరణ

కాకతీయ విశ్వవిద్యాలయం వంటి విద్యాసంస్థలకు తోడుగా అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు, పరిశోధనా కేంద్రాలు,  సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలి.  ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం స్థానికంగానే అందుబాటులోకి తీసుకురావాలి.  వరంగల్ కోట, వేయిస్తంభాల గుడి, రామప్ప, లక్నవరం, పాకాల సరస్సు, ములుగు ప్రాంతాలను అనుసంధానిస్తూ అంతర్జాతీయ పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేయాలి.  దీనివల్ల పర్యాటకం,  హోటళ్లు,  స్థానిక వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో పెరుగుతున్న జనాభా మౌలిక సదుపాయాల ఒత్తిడిని తగ్గించడానికి వరంగల్ వంటి నగరాల్లో పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య కేంద్రాలను విస్తరించాలి.

పరిపాలనా వికేంద్రీకరణ

వరంగల్‌‌‌‌‌‌‌‌ను రెండో రాజధానిగా అభివృద్ధి చేసే ప్రతిపాదనపై  నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి.  గ్రేటర్ వరంగల్‌‌‌‌‌‌‌‌కు ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. పారిశ్రామిక కారిడార్లు, ఐటీ పార్కులు ఏర్పాటు చేయాలి.  విమానాశ్రయం, కాజీపేట రైల్వే జంక్షన్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఎగుమతి కేంద్రాలు ఏర్పాటు చేయాలి. విద్య, వైద్యం, పర్యాటక రంగాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి. తెలంగాణలోని అన్ని జిల్లాలకు సమాన అభివృద్ధి అవకాశాలు కల్పించాలి. 

తెలంగాణ భవిష్యత్తుకు కొత్త దిశ!

హైదరాబాద్ మన రాష్ట్రానికి గర్వకారణం. అదే సమయంలో వరంగల్ కూడా మరో ప్రధాన అభివృద్ధి కేంద్రంగా ఎదగాలి. వరంగల్‌‌‌‌‌‌‌‌కు చరిత్ర ఉంది, విద్యాసంస్థలు ఉన్నాయి, వ్యవసాయ వనరులు ఉన్నాయి, పారిశ్రామిక అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. వీటన్నింటినీ సమన్వయంచేసి రెండో రాజధాని స్థాయిలో అభివృద్ధి చేస్తే తెలంగాణకు కొత్త ఆర్థిక, పారిశ్రామిక, పరిపాలనా కేంద్రం ఏర్పడుతుంది.  హైదరాబాద్ అభివృద్ధి చెందాలి.  వరంగల్ కూడా ఎదగాలి. పరిశ్రమలు అన్ని జిల్లాలకు విస్తరించాలి. ముఖ్యమంత్రి,  రాష్ట్ర మంత్రివర్గం ఈ ప్రజాహిత ప్రతిపాదనను పరిశీలించి వరంగల్‌‌‌‌‌‌‌‌ను తెలంగాణ రెండో రాజధానిగా అభివృద్ధి చేసే దిశగా కార్యాచరణ  చేపట్టాలని ఆశిద్దాం. 

- ఇమ్మడిశెట్టి దేవేందర్ కాపు
మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్ సోషల్ వర్క్‌‌‌‌‌‌‌‌

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
[email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.