గిరిజనుల అభ్యున్నతికి అండగా ప్రభుత్వం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

గిరిజనుల అభ్యున్నతికి అండగా ప్రభుత్వం :  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల టౌన్, వెలుగు: గిరిజనుల సంక్షేమం, అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం జగిత్యాలలో సంతు సేవాలాల్ మహారాజ్, జగదాంబ మాత ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌‌‌‌తో కలిసి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజనుల ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గిరిజన సమాజ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. 

సంతు సేవాలాల్ మహారాజ్ బోధనలు సమాజానికి ఆదర్శమని, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ బంజారా సంక్షేమ సంఘానికి గతంలో భూమితో పాటు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. ఆలయ నిర్మాణానికి కూడా తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అడువల జ్యోతి, బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు భూక్య నందు నాయక్ తదితరులు పాల్గొన్నారు.