శబరిమల: వార్షిక మండల యాత్ర సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ‘స్వామియే శరణం అయ్యప్ప’అనే శరణు ఘోషలతో ఆలయ పరిసరాలు మార్మోగుతుండగా సోమవారం సాయంత్రం 4 గంటలకు ఆలయ తలుపులు తెరుచుకోగా, వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
తంత్రి కందరు బ్రహ్మదత్తన్ సమక్షంలో ప్రస్తుత ప్రధాన అర్చకులు (మేల్శాంతి) ఇడీ ప్రసాద్ నంబూద్రి ఆలయ తలుపులు తెరిచి, జ్యోతిని వెలిగించారు. అనంతరం 18 పవిత్ర మెట్లు దిగి హోమగుండం వెలిగించి, నూతనంగా నియమితులైన ప్రధాన అర్చకులను సన్నిధానానికి తోడ్కొని వెళ్లారు. ఆ తర్వాత తంత్రి ఆధ్వర్యంలో శబరిమల నూతన మేల్శాంతిగా అరీక్కర సుబ్రమణియన్ శంకరన్ నంబూద్రి పట్టాభిషేక (కలశాభిషేక) కార్యక్రమం జరిగింది.
అదేవిధంగా మాలికాపురం ఆలయ నూతన మేల్శాంతిగా దామోదరన్ నంబూద్రి బాధ్యతలు స్వీకరించారు. ఆలయ తలుపులు తెరవకముందే పంబ బేస్ క్యాంప్ నుంచి అటవీ మార్గంలో గంటల తరబడి కాలినడకన కొండపైకి చేరుకుని, స్వామిని దర్శించుకున్నారు. మండల సీజన్ ప్రారంభం సందర్భంగా ఈ నెల 17 (మంగళవారం) తెల్లవారుజామున 3 గంటలకు నూతన ప్రధాన అర్చకులు ఆలయ తలుపులు తెరవడంతో యాత్ర ప్రారంభమవుతుంది.
