హైదరాబాద్ లో హైటెన్షన్ వైర్ తగిలి మూడో తరగతి విద్యార్థిని చనిపోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. 2026 నవంబర్ 16న ముషీరాబాద్ లోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలోని నైట్ ఏంజెల్ హోమ్‌లో సెకండ్ ఫ్లోర్ లో సాయంత్రం 4 గంటలకు ఈ ఘటన జరిగింది.
హాస్టల్ మొదటి అంతస్తు నుంచి రెండో అంతస్తుకు వెళ్లడానికి తలుపు గ్రిల్ ఏర్పాటు చేశారు. రెండో అంతస్తుకు వెళ్ళి పిల్లలు ఆడుకుంటున్న క్రమంలో హాస్టల్ వెనుక ఉన్న హైటెన్షన్ వైరు తగిలి ప్రమాదం జరిగింది. మాఫ్ స్టిక్ తో ఆడుతుండగా షాక్ తో మూడవ తరగతి విద్యార్థిని రెబెకా మృతి చెందింది. మరో ఇద్దరు విద్యార్థినిల చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వారు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
అదే విధంగా మరో ఇద్దరు విద్యార్థినిలు తృటిలో తప్పించుకున్నారు. గాయపడిన బాలికలను ఇద్దరీని వైద్యం కోసం గాంధీకి తరలించారు. మృతదేహానికి గాంధీలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై ముషీరాబాద్ పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
