కాపాడవయ్యా.. కురుమూర్తి రాయా!..వైభవంగా కొనసాగుతున్న కురుమూర్తి బ్రహ్మోత్సవాలు

కాపాడవయ్యా.. కురుమూర్తి రాయా!..వైభవంగా కొనసాగుతున్న కురుమూర్తి బ్రహ్మోత్సవాలు
  • నేడు అత్యంత ప్రాముఖ్యమైన ఉద్దాల ఉత్సవం 
  • వడ్డేమాన్ నుంచి కురుమూర్తికి పాదుకల తరలింపు
  • తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి తరలిరానున్న భక్తులు
  • అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

చిన్నచింతకుంట, వెలుగు : పేదల తిరుపతిగా తెలంగాణలో ప్రసిద్ధి చెందిన మహబూబ్​నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్​ గ్రామశివారులోని కురుమూర్తి క్షేత్రంలో వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో అత్యంత ముఖ్య ఘట్టమైన ‘ఉద్దాల ఉత్సవం’ సోమవారం కన్నులపండువగా నిర్వహించనుండటంతో తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీకి తగినట్లుగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, క్షేత్రమంతా గోవిందనామస్మరణతో  మార్మోగుతోంది. పోలీసులు పటిష్ట బందోబస్తును నిర్వహిస్తున్నారు. 

ఇంటి ఇలవేల్పుగా..

తిరుపతిలో మాదిరే కురుమూర్తిలో  ఏడు కొండలు (శ్వేతాద్రి, దుర్గాద్రి, ఘనాద్రి, భల్లుకాద్రి, పతకాద్రి, దేవతాద్రి) ఉన్నాయి. దేవతాద్రి గుట్టపైనే వేంకటేశ్వరుడు స్వయంభూగా వెలిశారు. ఈ గుట్టను కాంచన గుహ అని కూడా పిలుస్తారు.  ఇక్కడి మూల విరాట్​కు మీసాలు ఉంటాయి. అందుకే  మీసాల వేంకటేశ్వరుడిగా కూడా భక్తులు కొలుస్తారు. కురుపతి, కురుమతి, కురుమూర్తిగా కూడా పిలుస్తారు. ఈ ప్రాంతానికి చెందిన చాలా మంది ఈ స్వామిని ఇంటి దేవుడిగా పూజిస్తూ, వారి పిల్లలకు కురుమూర్తిగా పేర్లు పెడతారు.

అభరణాల అలంకరణ..

అమరచింత సంస్థానాధీశులైన ముక్కెర వంశస్తుల ఇలవెల్పు కురుమూర్తి వేంకటేశ్వరుడు. 15వ శతాబ్దంలో రాజా సోంభూపాల్ స్వామి వారికి బంగారు అభరణాలను చేయించారు. అందులో శంకుచక్రాలు, కిరీటం, మకర కుందనాలు, భుజ కిరీటాలు, ఇతర అభరణాలు ఉన్నాయి. ప్రతిఏటా జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా వీటిని స్వామికి అలంకరిస్తారు. ఈ ఆభరణాలను మొదట్లో రాజావారి బంగ్లాలోనే భద్రపరిచేవారు. అయితే, 1968లో ఈ క్షేత్రం దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్లడంతో, 1976 నుంచి ఆత్మకూరులోని ఎస్బీఐ లాకర్​లో భద్రపరుస్తున్నారు. అక్కడి నుంచే పోలీసుల భద్రత, భారీగాఊరేగింపు మధ్య అభరణాలను కురుమూర్తికి తీసుకొస్తారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత అభరణాలను తీసి, మళ్లీ ఎస్బీఐ లాకర్​లో భద్రపరుస్తారు. ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు జరుగుతుండడంతో శనివారం స్వామివారి ఆభరణాలు అలంకరోత్సవం ఘనంగా జరిగింది.

నైవేద్యంగా దాసంగాలు

కురుమూర్తికి వచ్చే భక్తులు స్వామికి దాసంగాలు సమర్పించడం ఆనవాయితీ. దాసంగాలు చేయడానికి కొత్త మట్టి కుండను ఉపయోగిస్తారు. కుండకు తెల్ల సున్నం పూసి, నామాలు పెట్టి కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తారు. అన్నం, పచ్చిపులుసు, భక్షాలను స్వామికి నైవేద్యంగా పెడతారు.

ఉద్దాల ఉత్సవం హైలెట్..
బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైనది ఉద్దాల ఉత్సవం. ఈ ఉత్సవానికి తెలంగాణ, ఏపీ, మహారాష్ర్ట, కర్ణాటక రాష్ర్టాల నుంచి దాదాపు నాలుగు లక్షల మంది భక్తులు వస్తారు. వీటిని క్షేత్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వడ్డేమాన్ గ్రామంలోని ఓ వర్గానికి చెందిన ఐదు కుటుంబాల వారు తయారు చేస్తారు. రాయలసీమ నుంచి తెప్పించిన తోలుతో వీటిని దీపావళి తరువాత కుట్టే పనిని ప్రారంభిస్తారు. కుట్టడానికి దాదాపు ఏడు రోజుల టైం పడుతుంది. ఆ సమయంలో ఈ  కుటుంబాలు నిష్టతో, ఉపవాస దీక్షలో ఉంటాయి. ఉద్దాలను సిద్ధం చేసిన తరువాత, వాటిని కురుమూర్తికి తరలించేందుకు ఇదే గ్రామానికి చెందిన మేదరులు ప్రత్యేక చాటను తీసుకొస్తారు. ఈ చాటలో ఉద్దాలను ఉంచి ఊరేగింపుగా వడ్డేమాన్ నుంచి కురుమూర్తికి తీసుకొస్తారు. ఈ సమయంలో దారిపొడవునా వేల మంది భక్తులు పాదుకలను తాకేందుకు ప్రయత్నిస్తారు. అనంతరం రాత్రి జాతర మైదానంలో పాదుకలను ఊరేగించిన తరువాత, గుట్ట మీద ఉన్న ఉద్దాల మండపానికి చేరుస్తారు. ముందుగా ఉద్దాలను మొక్కిన తరువాతే, భక్తులు వేంకటేశ్వరుడిని దర్శించుకుంటారు. 

స్వామికి సేవ చేసే అదృష్టం నాకు దక్కింది
పాలమూరు పేదల తిరుపతి అయిన కురుమూర్తి స్వామి ఆలయ అభివృద్ధిలో భాగస్వామి కావడం ఆ స్వామి నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. ఆలయ అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.110 కోట్లు తీసుకొచ్చాం.  స్వామివారి దర్శనానికి కారిడార్ రోడ్డు పనులు చేపట్టడం, దేవాలయానికి తాగునీటి సమస్య తీర్చేందుకు రూ.38 కోట్లతో మంచినీటి వసతి కల్పించాం. మరో రూ.100 కోట్ల నిధుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించగా, ఆయన సానుకూలంగా స్పందించి డీపీఆర్ రెడీ చేయమని ఆదేశించారు. - (ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి) 

భక్తులకు ఇబ్బందుల్లేకుండా చూస్తాం 
కురుమూర్తి స్వామి జాతరకు, ఉద్దాల ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తాం. పోలీస్ శాఖ వారు అదనపు బలగాలతో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తులు కూడా అధికారులకు సహకరించాలి. (‌‌- బత్తుల బాలరాజ్, ఆలయ చైర్మన్ )

ఇలా చేరుకోవాలి..
కురుమూర్తి క్షేత్రానికి రైలు, రోడ్డు మార్గాన యాత్రికులు చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి రైలు మార్గాన వచ్చే వారు దేవరకద్ర లేదా కురుమూర్తి రైల్వే స్టేషన్, వనపర్తి రోడ్డు రైల్వే స్టేషన్​లో దిగొచ్చు. అక్కడి నుంచి బస్సు, ప్రైవేట్ వాహనాల్లో క్షేత్రానికి చేరుకోవచ్చు. రోడ్డు మార్గాన హైదరాబాద్ నుంచి వచ్చే వారు ఎన్​హెచ్–44  మీదుగా జడ్చర్ల నుంచి మహబూబ్​నగర్ బస్టాండ్​కు చేరుకోవాలి. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్షేత్రానికి చేరుకోవచ్చు. అలాగే కర్నూలు వైపు నుంచి ఎన్​హెచ్–44 మీదుగా వచ్చే వారు కొత్తకోటకు చేరుకోవాలి. అక్కడే వనపర్తి డిపో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల ద్వారా మదనాపురం, కొత్తపల్లి, దుప్పల్లి, అమ్మాపూర్ మీదుగా క్షేత్రానికి చేరుకోవచ్చు.